కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దావానలం ధాటికి ఈ ఏడాది సుమారు 40 లక్షల ఎకరాలు దగ్ధమైంది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల ఇళ్లు కాలిపోయాయి.
కనెక్టికట్ రాష్ట్రం విస్తీర్ణం కన్నా ఎక్కువ ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నాయి. సాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన్న ఉన్న వైన్ కంట్రీలో శుక్రవారం హైఅలర్ట్ ప్రకటించింది అగ్నిమాపక శాఖ. శనివారం భీకర గాలులతో భయంకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
నాపా, సోనోమా ప్రాంతాల్లో శనివారం 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. దాంతో అగ్ని జ్వాలలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని, 28 వేల ఇళ్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించారు.
" అంచనా వేసిన ప్రకారం భీకర గాలులేమి ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ, తప్పకుండా గాలులు వీస్తాయి. దాంతో దావానలం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అదే ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం అగ్ని జ్వాలలు ఉన్న పశ్చిమ భాగంలో అధిక ఎత్తులో గాలులు వీస్తున్నాయి. మంటలను నిరోధించటానికి పెద్దఎత్తున ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాలిస్టోగా నగరంలో భారీగా సిబ్బంది, సామగ్రిని మోహరించాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, నల్లటి పొగ ఆవరించి ఉంది.
- మార్క్ బ్రుటన్, అగ్నిమాపక విభాగం చీఫ్, కాలిఫోర్నియా
కారణం అదే..
అమెరికాలో అధికస్థాయుల్లో బొగ్గు, చమురు, గ్యాస్‌లను మండించటం ద్వారానే వాతావారణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణంలో మార్పులతో కాలిఫోర్నియా పూర్తిగా పొడిగా మారిందని, వృక్షాలు, ఇతర చెట్లు మండిపోయేందుకు సిద్ధంగా ఉండి దావానలానికి ఆజ్యం పోస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఏర్పడిన కార్చిచ్చు.. గత మూడేళ్లలో వచ్చిన పెద్దవాటిల్లో నాలుగోది.
రంగంలోకి 17వేల మంది సిబ్బంది..
రాష్ట్రవ్యాప్తంగా రెండు డజన్లకుపైగా ప్రాంతాల్లో ఏర్పడిన కార్చిచ్చును అదుపు చేసేందుకు 17వేల మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగస్టు రెండో వారం నుంచి ఇప్పటి వరకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడి మంటలు చెలరేగేందుకు కారణమయ్యాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 30.9 లక్షల ఎకరాలు(15,500 చదరపు కిలోమీటర్లు) దగ్ధమైనట్లు కాలిఫోర్నియా డిప్యూటీ చీఫ్ జొనాథన్ కాక్స్ తెలిపారు. గత ఆదివారం నుంచి సుమారు 600 భవనాలు, 220 ఇళ్లు, అదే సంఖ్యలో వాణిజ్య సమూహాలు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న దావానలం కారణంగా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: అమెరికాలో ఆగని కార్చిచ్చు