అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లిన్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్ ముఖాముఖీ తలపడనున్నారు. యూటా రాష్ట్రంలోని సాల్ లేక్ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. యూఎస్‌ఏ టుడే పత్రికకు చెందిన సుసన్ పేజ్ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించనున్నారు. అమెరికా చరిత్రలో ఓ ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఓ భారత సంతతి వ్యక్తి పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.
హారిస్ ఆధిపత్యంపై అంచనాలు..
వీరువురి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు దోహదం చేయనుంది. మరోవైపు ట్రంప్ కరోనా బారినపడడం కారణంగా పెన్సే ప్రస్తుతానికి రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రముఖ ప్రచారకర్త. ఈ నేపథ్యంలో తన సొంత విధానాలతో పాటు ట్రంప్ లక్ష్యాలను కూడా ఆయన వివరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తిరిగి ఎప్పుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.
మరోవైపు బైడెన్ బృందంలో హారిసే కీలక పాత్ర పోషించనున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరివురి చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. చర్చలో పెన్స్‌పై హారిస్ ఆధిపత్యం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం..
అధ్యక్ష అభ్యర్థులు ప్రత్యక్ష చర్చలో పాల్గొన్న కొన్ని రోజులకే ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా కార్యక్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల మధ్య గ్లాస్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:సైనిక ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్ఛార్జి