కొవిడ్-19ను(Covid-19) ఎదుర్కొనే వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఔషధాలపై మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్(merck pharma news) రూపొందించిన ఔషధం.. ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు పేర్కొంది. మాత్రల రూపంలో తీసుకొచ్చిన ఈ ఔషధం త్వరలోనే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్ ఫార్మా వెల్లడించింది.
కొవిడ్-19 పోరులో భాగంగా రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిక్స్ భాగస్వామ్యంతో మెర్క్ ఫార్మా సంస్థలు కలిసి మాత్ర రూపంలో తయారు చేసిన మోల్నూపిరవిర్ (Molnupiravir) ఔషధంపై ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 775 మంది వాలంటీర్లపై వీటిని చేపట్టారు. కొవిడ్ లక్షణాలు వెలుగు చూసిన ఐదు రోజుల్లో ఈ మాత్రలను వాడి చూశారు. వీరిలో డమ్మీ ఔషధం ఇచ్చిన వారితో పోల్చి చూడగా మోల్నూపిరవిర్ తీసుకున్న సగం మందికి ఆస్పత్రి చేరిక అవసరం లేదని గుర్తించారు. అంతేకాకుండా ప్లెసిబో తీసుకున్న వారితో పోలిస్తే మోల్నూపిరవిర్ మాత్రలు వాడిన బాధితుల్లో మరణాలు అతి స్వల్పమని కనుగొన్నారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా ఎఫ్‌డీఏకు అందించడంతో పాటు త్వరలోనే అంతర్జాతీయ శాస్త్రపరిశోధన పత్రికల్లో సమీక్ష (పీర్ రివ్యూ)కు ఉంచుతామని మెర్క్ ఫార్మా వెల్లడించింది.
కొవిడ్-19ను(Covid-19) ఎదుర్కోవడంలో మోల్నూపిరవిర్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని మెర్క్ నిపుణులు డాక్టర్ డీన్‌లీ పేర్కొన్నారు. అంతేకాకుండా వీటివల్ల కలిగే దుష్ర్పభావాలు కూడా సాధారణంగా ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ చికిత్సలో వినియోగిస్తోన్న ఇంజక్షన్ రూపంలో ఉన్న ఔషధాల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయుక్తంగా ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: