కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి సాధించినట్లు తెలిపింది కెనడాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మెడికగో. ఎలుకలపై ప్రయోగించిన వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు ప్రకటించింది. సింగిల్ డోస్‌తో 10 రోజుల్లోనే ఎలుకల్లోని యాంటీబాడీస్ అద్భుతంగా పనిచేసినట్లు పేర్కొంది. అయితే మనుషులకు ఎన్ని డోసులు అవసరమవుతుందో ఇంకా అంచనాకు రాలేదని తెలిపారు పరిశోధకులు. ప్రస్తుత సదుపాయాలతో తాము ఏడాదిలో 20 నుంచి 100 మిలియన్ డోసులను సిద్ధం చేయగలమన్నారు.
ఆరోగ్య కార్యకర్తలపై వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని తెలిపారు పరిశోధకులు. మానవులపై ట్రయల్స్ నిర్వహించేందుకు కెనడా, అమెరికా ప్రభుత్వాల అనుమతి తీసుకోనున్నారు.
'సార్క్ కొవ్-2' జన్యువును పోలిన వైరస్ కణాన్ని.. మార్చి ప్రారంభంలోనే ఉత్పత్తి చేసింది మెడికగో. ఇందుకు 20 రోజులే పట్టినట్లు తెలిపింది. ఆ తర్వాత ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ వేసవిలోనే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
కోతులపైనా సక్సెస్..
కొవిడ్-19 నుంచి రక్షణ కోసం తయారుచేస్తున్న మరో టీకా ఆశలు కల్పిస్తోంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్.. కోతులపై చేసిన పరిశోధనలో ఆశాజనక ఫలితాలు రాబట్టింది. ఇది వానరాల్లో రోగనిరోధక శక్తిని పెంచి ప్రాణాంతక వైరస్‌ను అడ్డుకుందని పరిశోధకులు తెలిపారు. ప్రతికూల ప్రభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు. ఒక వ్యాక్సిన్ డోస్ ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాలపై వైరస్ తీవ్రత తగ్గించిందని పరిశోధకులు తెలిపారు.
"వానరాలకు మేం ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చాం. మిగతా కోతులతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వాటి ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గడం, శ్వాసనాళంలోని కణజాలం వైరస్‌ను అడ్డుకోవడాన్ని మేం గమనించాం. వైరస్ తాలూకు న్యుమోనియా సైతం కనిపించలేదు" అని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు తెలిపారు.
అతి ప్రమాదకర స్థాయి నావెల్ కరోనా వైరస్‌కు గురిచేసినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు కోతుల్లో న్యుమోనియా లక్షణాలు, దుష్ప్రభావం కనిపించలేదని వెల్లడించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మానవుల్లో వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
బ్రిటన్‌లో ఈ టీకా ట్రయల్స్ విజయవంతమైతే కెన్యాలో ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరాలని ఆక్స్‌ఫర్డ్ భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకా అవసరం ఎక్కువగా ఉందని తెలిపింది.