1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ నిబంధనల కింద అజార్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు రెండు వారాల కిందట చైనా మోకాలడ్డింది. 15 దేశాలకు సభ్యత్వం ఉన్న భద్రతా మండలిలో అజార్‌పై నిషేధం విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అతడిపై ప్రయాణ ఆంక్షలు, ఆస్తుల జప్తు, ఆయుధాల వాడకంపై ఆంక్షలు విధించాలని నివేదించింది.
మొదటిసారి నేరుగా తీర్మానం
భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు నేరుగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీకి తమ తీర్మానాలు అందించేవి. సాధారణ తీర్మానానికి విధించే 10 రోజుల గడువు ఈ ముసాయిదాకు వర్తించదు. ఈ తీర్మానంపై ముందు అనధికారికంగా చర్చించిన అనంతరమే భద్రతా మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై ఓటింగ్ ఎప్పుడు జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. ఇంతకుముందు అజార్‌పై నిషేధాన్ని వీటో చేసినట్టుగానే.. ఈసారీ చైనా వ్యవహరించే అవకాశం ఉంది.
అభియోగాలివే...
జమ్ము కశ్మీర్ పుల్వామాలో సైనిక వాహనంపై కుట్రపూరితంగా చేసిన దాడిని తీర్మానం ఖండించినట్లు సమాచారం. అజార్‌కు ఇస్లామిక స్టేట్ గ్రూప్‌తోనూ సంబంధాలున్నాయని, అల్-ఖైదా అజార్ ఉగ్రసంస్థ జైషేకు ఆర్థిక, ప్రణాళిక, ఆయుధ సరఫరా వంటి చేయూతనందిస్తోందని తీర్మానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 1999లో భారత జైలు నుంచి విడుదలైన అనంతరం హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడని ముసాయిదాలో ఉటంకించారు. అఫ్ఘానిస్తాన్‌లో పాశ్చాత్య సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు జైషేలో చేరాలని పిలుపునిస్తూ 2008లో అజార్ ప్రకటనతో కూడిన గోడ పత్రికలు వెలిశాయి.
చైనా వీటో వల్లే కుదరలేదు...
ఫిబ్రవరి 27న ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా అజార్‌పై నిషేధం విధించాలని ఆంక్షల కమిటీ ద్వారా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. నిషేధం విధించడానికి 15 దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలిలో 9 దేశాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఏ ఒక్కటీ తీర్మానాన్ని వీటో చేయకూడదు. మార్చి 13 నాటికి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న ఈ తీర్మానాన్ని చైనా వీటో చేయడం కారణంగా వీగిపోయింది. చైనా నిర్ణయంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐదోసారి తీర్మానం...
మసూద్ అజార్‌పై నిషేధం విధించాలని 2009లో మొట్టమొదటిసారిగా భారత్ తీర్మానాన్ని ప్రతిపాదించింది. 2016లో పీ3 దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు పటాన్‌కోట్ ఉగ్రదాడిని గర్హిస్తూ ఆంక్షల కమిటీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 2017లోనూ ఇవే దేశాలు మరోసారి తీర్మానాన్ని ప్రతిపాదించాయి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఫిబ్రవరిలో మరోసారి ఆంక్షల కమిటీ తలుపుతట్టాయి పీ3 దేశాలు. తాజాగా నేరుగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
అమెరికా నిర్ణయంపై డ్రాగన్ అక్కసు
మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అమెరికా నిర్ణయంపై అక్కసు వెళ్లగక్కింది చైనా. నేరుగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఆంక్షల కమిటీ గౌరవాన్ని తగ్గించడమేనని పేర్కొంది. అమెరికా నిర్ణయం మసూద్ అంశాన్ని సంక్లిష్టం చేస్తుందని అభిప్రాయపడింది. ఈ అంశమై అప్రమత్తంగా వ్యవహరించాలని, ముసాయిదా తీర్మానాన్ని బలవంతంగా అమలు చేయడాన్ని నిరోధించాలని ఐరాస భద్రతామండలిని కోరనున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి:'దమ్మున్న చౌకీదార్‌కు, కళంకితులకు పోటీ'