కరోనా రాకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించకుండా కేవలం మాస్క్ ధరిస్తే సరిపోదని తాజా అధ్యయనంలో తేలింది. మాస్క్ ధరిస్తే కరోనా వ్యాప్తి తగ్గొచ్చు. అయితే మాస్క్ ధరించి 6 అడుగులు లేదా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించకపోతే కరోనా బారిన పడే ప్రమాదం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
మాస్క్ ధరించి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ఎంత దూరం వ్యాపిస్తాయనే విషయంలో సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్క్, రెండు పొరల మాస్క్, సర్జరికల్ మాస్క్, ఎన్-95 మాస్క్ వంటి ఐదు రకాల మాస్కులపై పరిశోధన చేసింది అమెరికాకు చెందిన న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయం.
ఈ అధ్యయనం 'ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్' జర్నల్లో ప్రచురితమైంది.
"కరోనా సోకకుండా ఉండటానికి మాస్కులు ఉపయోగపడతాయి. అయితే ప్రజలు భౌతిక దూరం పాటించకపోతే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మాస్క్ ధరిస్తే సరిపోదు. భౌతిక దూరం కూడా పాటించాలి" అని వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ కోట అన్నారు.
సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్క్ నుంచి 3.6శాతం తుంపర్లు బయటకు వస్తున్నాయని తేల్చింది ఈ పరిశోధన. అయితే.. ఎన్-95 మాస్క్ 100 శాతం బిందవులు బయటకు రాకుండా ఆపగలదని వెల్లడించింది. సాధారణంగా ఓ వ్యక్తి తుమ్మినప్పుడు 200 మిలియన్ల నీటి బిందువులు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ 15 మందికి ట్రంప్ క్షమాభిక్ష