US airlines warning on 5G: అమెరికాలో బుధవారం ప్రారంభం కానున్న 5జీ సీబ్యాండ్ సేవలపై అక్కడి ఎయిర్లైన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బ్యాండ్ వల్ల అనేక విమానాలు నిలిచిపోతాయని పేర్కొంది. అమెరికా విమానాల విషయంలో గందరగోళం తలెత్తుతుందని తెలిపింది.
US airlines 5G effect
ఏటీ అండ్ టీ, వెరిజోన్ సంస్థలు కలిసి 5జీ సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అయితే దీని వల్ల 36 గంటల్లోపే విమానయాన సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా పౌర, సరకు రవాణా విమాన సేవల సంస్థలు పేర్కొన్నాయి. 'బోయింగ్ 777ఎస్' విమానాలు అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు. బోయింగ్ కార్గో ప్లేన్లు సైతం నిలిచిపోవచ్చన్నారు.
5G services Airlines warning
'5జీ సర్వీసులు వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వందలాది విమానాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వేలాది మంది అమెరికన్లు ఎక్కడికక్కడే చిక్కుకుపోతారు' అని విమానయాన సంస్థలు వివరించాయి. ఈ మేరకు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యూపీఎస్ ఎయిర్‌లైన్స్, అలస్కా ఎయిర్, అట్లాస్ ఎయిర్, జెట్‌బ్లూ ఎయిర్వేస్, ఫెడ్ఎక్స్ ఎక్స్‌ప్రెస్ సంస్థలు.. శ్వేతసౌధ జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్, రవాణా కార్యదర్శి, ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఛైర్వుమన్లకు లేఖ రాశాయి.
లక్ష మందిపై ప్రభావం!
మరోవైపు, ఆల్టీమీటర్లు వంటి సున్నితమైన విమాన పరికరాలను 5జీ సేవలు ప్రభావితం చేసే అవకాశం ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) హెచ్చరించింది. లో-విజన్‌లో కార్యకలాపాలు సాగించే విమానాలు పూర్తిగా నిలిచిపోతాయని పేర్కొంది. 'ఉదాహరణకు నిన్నటి (సోమవారం) రోజును తీసుకుంటే 1,100కు పైగా విమానాలు, లక్ష మందికిపైగా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో జరిగేది' అని వివరించింది.
ఈ నేపథ్యంలో ముందుగానే విమానాలను నిలిపివేయాలని ఎయిర్లైన్లు ఆలోచిస్తున్నాయి. బుధవారం అమెరికాకు రావాల్సిన అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని యోచిస్తున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.
ఎయిర్పోర్ట్ రన్‌వేలకు దగ్గరగా 5జీ టవర్లు ఉండకుండా చూడాలని విమానయాన సంస్థలు కోరాయి. అనంతరం పెనుముప్పు తలెత్తకుండా ఏం చేయాలో ఎఫ్ఏఏ నిర్ణయిస్తుందని, దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు.. డ్రైవర్ షాక్‌లోకి