అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకా అందిస్తున్న నేపథ్యంలో యువకులు, ఇతర పౌరులు తమ వంతు కోసం నిరీక్షించడం తప్పనిసరి అవుతోంది. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొందరికి అదృష్టవశాత్తు టీకా లభిస్తుండటం విశేషం.
అదనంగా ఉన్న టీకా డోసులను వృథా చేయకుండా ఇతరులకు అందిస్తున్నారు అధికారులు. లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి అందుబాటులో ఉండే వ్యక్తులకు టీకా ఇస్తున్నారు. ఇలా టెన్నెసీలోని నాష్విల్కు చెందిన 22 ఏళ్ల జెస్సీ రాబిన్సన్ వ్యాక్సిన్ అందుకున్నాడు.
"నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. డ్రాలో పాల్గొన్నాను. ఈరోజు నాకు ఫోన్ వచ్చింది. ఐదు నిమిషాల్లో అది(వ్యాక్సినేషన్) పూర్తయింది. ఇక్కడ లాటరీ టికెట్ తీసుకోవాలని ఓ నర్సు నాకు చెప్పింది. రోజు 15 వేల మంది వస్తారని చెబుతున్నారు. ఈరోజు ఒకరిని ఎంపిక చేశారు. ఇందులో నేను ఉండటం ఆనందంగా ఉంది."
-జెస్సీ రాబిన్సన్, నాష్విల్ నివాసి
డేవిడ్ మాక్మిలాన్ అనే వ్యక్తికి సైతం ఇలాగే ఉచిత టీకా అందింది. వాషింగ్టన్లో ఓ దుకాణంలో ఉన్న వారికి టీకా అదృష్టం వెతుక్కుంటూ మరీ వచ్చింది. మిగిలిన డోసులను తీసుకుంటారా? అని అడిగేందుకు పక్కనే ఉన్న ఫార్మా సిబ్బంది వీరిని సంప్రదించారు.
అయితే, మిగిలిన డోసులకు ఉన్న డిమాండ్ ఒక్కోసారి సమస్యలకు దారితీస్తోంది. బ్రూక్లిన్లో ఇలాగే వ్యాక్సిన్ డోసులను ఇస్తున్నారని వదంతులు వ్యాపించడం వల్ల రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా లభిస్తుందనే ఆశతో పెద్ద ఎత్తున ప్రజలు క్లినిక్ల వెంట పరుగులు తీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు రంగంలోకి దిగి టీకా వార్తలు అవాస్తవమని చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది.