వాషింగ్టన్లోని ఓ మహిళ రెండేళ్ల క్రితం ఓ మొక్కను కొనుగోలు చేసి ఎంతో అపురూపంగా పెంచుకుంటోంది. నిత్యం దాని పొదలు శుభ్రం చేసి నీరు పోస్తూ ఎక్కువ సమయం ఆ మొక్కతో గడిపేది. వేరే వారిని ఆ మొక్కకు నీరు కూడా పోయనిచ్చేది కాదు. చివరకు అది అసలు మొక్కే కాదని ఓ రోజు తెలిసి విస్తుపోయింది. రెండేళ్ల తన శ్రమ వృథా అయిందని తీవ్ర ఆవేదనకు గురైంది.
కైలీ విల్కేస్ రెండేళ్ల క్రితం ఓ మొక్కను కొనుగోలు చేసింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంది. ఓ రోజు మొక్కను వేరే పూల కుండీలోకి మార్చాలని బయటకు తీసి చూసి షాక్ అయింది. అదో ప్లాస్టిక్ మొక్కని గ్రహించి నివ్వెరపోయింది.
" రెండేళ్ల క్రితం ఈ మొక్కను కొనుగోలు చేశా. ఇది మంచి రంగుతో ఎంతో ఆకట్టుకునేలా ఉంది. దీన్ని నా వంటగదిలో కిటికీ దగ్గర ఉంచా. నిత్యం ఈ మొక్కకు నీరు పోస్తూ సంరక్షించేదాన్ని. ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటోన్న ఈ మొక్క ప్లాస్టిక్ అని తెలిసి విస్తుపోయా. ఇది అందంగా కనిపించడానికి చాలా కష్టపడేదాన్ని. రెండేళ్లుగా దీని గురించి తెలుసుకోకుండా ఎలా ఉన్నాను? ఈ రెండేళ్లు ఓ అబద్ధమని బాధపడుతున్నా."
--- కైలీ విల్కేస్, మొక్క యజమాని
మొక్క విషయంలో మోసపోయానని ఆవేదన చెందిన కైలీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంది. పోస్ట్ చేసిన రోజే 9.2 వేల కామెంట్స్ వచ్చాయి.
ఇదీ చదవండి: ట్రంప్ సభకు హాజరైన వ్యక్తికి కరోనా