ప్రపంచమంతా నేను, నా కుటుంబం అంటూ స్వార్థంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో... జనం కోసం నేను అన్నట్లు ఆమె స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. కరోనా వైరస్ నివారణకు తయారు చేసిన టీకా ప్రయోగాలను తనపై చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఆమె పేదరికంలో డబ్బు కోసం చేస్తున్న పని అనుకుంటే పొరపాటు. ఆమె ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్. కరోనా వైరస్ నివారణకు అభివృద్ధి చేసిన తొలిటీకా ప్రయోగాత్మక షాట్‌ను తీసుకున్న ఆమె పేరు జెన్నిఫర్ హాలెర్.
నలభైమూడేళ్ల జెన్నిఫర్ హాలెర్ అమెరికాలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల కరోనా ప్రబలడంతో అమెరికాలోని చాలా సంస్థలు ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. జెన్నిఫర్‌కు అప్పటికే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించారు. మరోపక్క చాలా సంస్థలు ఉద్యోగాలను తొలగించాయి. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ అయిన జెన్నిఫర్ భర్త కూడా ఉన్నారు. ఈ పరిస్థితి జెన్నిఫర్‌ను ఆలోచనలో పడేసింది. అమెరికాలో చాలామంది నిరుద్యోగులుగా మారారు.. వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారో అని బాధపడింది. ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలకు 15- 55 ఏళ్లలోపు అభ్యర్థులు కావాలనే ప్రకటన ఆమె కంటపడింది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాను ఇంతకంటే సాయం చేసే అవకాశం ఉండదని భావించి వెంటనే దరఖాస్తు చేసుకుంది. ఈ పరీక్షలకు చాలామంది ముందుకు రాగా.. హాలెర్‌తోపాటు మరో నెట్‌వర్క్ ఇంజినీరు, మరొక ఎడిటోరియల్ కోఆర్డినేటర్ మాత్రమే ఎంపికయ్యారు. వీరిలో కూడా తొలుత వ్యాక్సిన్ షాట్‌ను జెన్నిఫర్ తీసుకున్నారు.
టీకా తీసుకున్నాక ఉత్సాహంగా..
అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్), మోడెర్నా సంస్థలు mRNAn1273 సాంకేతిక నామంతో ఈ టీకాను అభివృద్ధి చేశాయి. సోమవారం ఉదయం జెన్నిఫర్ ఈ టీకాను తీసుకుంది. ‘‘ నిస్సహాయంగా ఉన్న ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి దొరికిన అవకాశం. సంక్షోభ సమయంలో మన కుటుంబం మాత్రమే అని ఆలోచించడం సహజం. అలాంటి సమయంలో మేల్కొని ఇతరులకు ఉపయోగపడే అవకాశం రావడం వరంగా భావిస్తా. దీన్ని సరికొత్త సాంకేతికతో చేశారు. దీనిలో వైరస్ ఉండదు’’ అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తరువాత ఆమె శరీరంలో వచ్చే మార్పులను అంచనా వేస్తూ తరచూ వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. దాదాపు నెలరోజుల తర్వాత మరో డోస్ టీకా ఇస్తారు. మునుపెన్నడు మనుషులపై ప్రయోగించని ఔషధాన్ని శరీరంలోకి తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. దాని దుష్ప్రభావాలు తెలియవు. అవి శరీరంలోకి వెళ్లి ఎలాగైన పనిచేయవచ్ఛు ఈ పరీక్షలు విజయవంతమైతే భయకంపితులవుతున్న సమస్త మానవాళికి గొప్ప ఉపశమనం దొరికినట్టే. జెన్నిఫర్‌పై నిర్వహించిన ప్రయోగం సఫలమై... ఆమె నిండు ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం.