అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను రోదసిలోకి తీసుకెళ్లే 'న్యూ షెపర్డ్' వ్యోమనౌక యాత్ర ఆద్యంతం ఒక ప్రణాళిక ప్రకారం సాగుతుంది. పూర్తి స్వయంచాలితమైన ఈ నౌకకు పునర్‌వినియోగ సామర్థ్యం ఉంది. దీన్ని పదేపదే ఉపయోగించొచ్చు. ఆరంభం నుంచి ముగింపు వరకూ యాత్ర ఇలా సాగుతుంది.
ఏమిటీ బ్లూ ఆరిజిన్?
రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను బెజోస్ స్థాపించారు. అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, లక్షల మంది పని చేసుకుంటూ, జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూ ఆరిజిన్ ప్రస్తుతం 'న్యూ గ్లెన్' అనే భారీ రాకెట్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌నూ తయారుచేసి, అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చేపట్టే ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.
భవిష్యత్తులో ఏం చేయబోతోంది?
తొలి రోదసి యాత్ర మినహా రాబోయే రోజులకు సంబంధించిన ఇతర విశేషాలను బ్లూ ఆరిజిన్ సంస్థ పెద్దగా వెల్లడించలేదు. ఈ ఏడాది మరో రెండు యాత్రలను చేపట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. ఈ రోదసియానాలు బాగా రిస్కుతో కూడిన వ్యవహారం అయినందున తొలి యాత్ర ద్వారా పెరిగే ఆదరణపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తరహాలో అంతరిక్ష పర్యాటకం కోసం బుకింగ్‌ను బ్లూ ఆరిజిన్ ఇంకా ప్రారంభించలేదు.
ఇదీ చూడండి: 'ఎడారి' నుంచి అంతరిక్షంలోకి శ్రీమంతుడు