క్యూబాలో కరోనా డెల్టా వేరియంట్(Covid Delta Variant) కారణంగా వైరస్ బారినపడే చిన్నారుల సంఖ్య పెరుగుతున్న వేళ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీపై(Vaccine For Kids) దృష్టి సారించింది. గురువారం 2-10 ఏళ్ల వయసు వారికి టీకా వేయడం(Vaccine For Kids) ప్రారంభించింది. దీంతో ఈ వయస్సు వారికి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన మొదటి దేశంగా నిలిచింది.
టీకాలపై పూర్తి స్థాయి క్లినికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. చిన్నారులకు టీకా పంపిణీ చేసేందుకు నిపుణులు ఆమోదం తెలిపారని అక్కడి అధికారులు తెలిపారు. కొన్నివారాల కిందటే 11 క్యూబాలో నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
డెల్టా వేరియంట్(Covid Delta Variant) కారణంగా క్యూబాలో వైరస్ బారిన పడి, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఆస్పత్రుల్లో మందులు, మౌలిక వసతుల కొరత కారణంగా.. మరణాల సంఖ్య పెరగడం సహా అర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఫినే ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన సొబెరానా టీకాతో పాటు క్యూబా సెంటర్ ఫర్ ఇమ్యునాలజీ అండ్ బయోటెక్నాలజీ సంస్థ తయారు చేసిన అబ్డాలా టీకాను క్యూబాలో వినియోగిస్తున్నారు. ఈ రెండు టీకాలకు అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
శ్రీలకంలో లాక్డౌన్ పొడిగింపు..
మరోవైపు.. శ్రీలంకలో కరోనా మూడో దశ ఉద్ధృతి(Sri Lanka Third Wave) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను(Sri Lanka Lockdown Update) .. అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పింది. శుక్రవారం ఆ దేశ ప్రధాని గొటబాయి రాజపక్స.. ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఏప్రిల్ మధ్య నుంచి శ్రీలంకలో మూడో దశ ఉద్ధృతి మొదలైంది. ఏప్రిల్ 30 వరకు కరోనా మరణాల సంఖ్య 700గా ఉండగా.. గురువారం నాటికి ఈ సంఖ్య 12,000 మార్కుకు చేరువైంది. తమ దేశంలో రోజువారీగా దాదాపు 2,300 చొప్పున కేసులు నమోదవుతున్నాయని అక్కడి ఆరోగ్య శాఖ అధికారి హేమంత హేరత్ తెలిపారు. ఈ సంఖ్యను తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
వైరస్ కట్టడికి శ్రీలంక ప్రభుత్వం వరుస లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తోంది. దీంతో అక్కడి ప్రధాన ఆదాయ వనురుల్లో ఒకటైన పర్యటక రంగంపై తీరని ప్రభావం పడింది.
ఇదీ చూడండి: Pregnant women: 'గర్భిణుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువే!'
హెల్త్ పాస్ ఉంటేనే..
ఇటలీలో(Corona In Italy Update) వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పని ప్రదేశాల్లో 'హెల్త్ పాస్' తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం, కరోనా నెగెటివ్‌గా తేలిన ధ్రువపత్రం లేదా ఆరు నెలల కింద వైరస్ సోకి, కోలుకున్నట్లుగా ఉన్న ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి ఉంటేనే పని ప్రదేశాల్లో ఉద్యోగులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని మారియో డ్రాఘి తెలిపారు.
ఈ హెల్త్పాస్ల కారణంగా పని ప్రదేశాలు.. వైరస్ నుంచి సురక్షితంగా ఉంటాయని ఇటలీ ఆరోగ్య మంత్రి రోబెర్టో స్పెరాంజా తెలిపారు. దీని వల్ల వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతమవుతుందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ తాజా నిబంధనలను పాటించని ఉద్యోగులు 1,500 యూరోలు, యాజమాన్యం 1000 యారోలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయని చెప్పింది.
ఇదీ చూడండి: NYT Article On India Covid: ఆ పత్రికవి రెచ్చగొట్టే కథనాలే..!
చైనాలో కలకలం...
కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో(China Coronavirus).. వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 100 కోట్ల మందికి పూర్తి స్థాయి టీకా డోసులను ఆ దేశం పంపిణీ చేసినప్పటికీ.. ఈ కొత్త కేసులు నమోదవడం గమనార్హం.
కొత్త కేసుల్లో ఒకటి ఫుజియాన్ రాష్ట్రంలో నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. 31 కేసులు జియామెన్‌లో, 28 కేసులు పుటియాన్‌లో, ఒక కేసు క్వాంజోవు నగరంలో నమోదైనట్లు చెప్పింది. తమ దేశంలో.. 72శాతం మందికి(100 కోట్ల మంది) రెండు డోసులు టీకా పంపిణీ చేశామని చైనా ఎన్‌హెచ్‌సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 216 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.
చైనాలో ఇప్పటివరకు 95,577 మందికి వైరస్ సోకగా.. 4,636 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
ఇదీ చూడండి: Mizoram covid: 'వారిలో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు'
దక్షిణ కొరియాపై పంజా..
దక్షిణ కొరియాపై కరోనా(South Korea Coronavirus) పంజా విసురుతోంది. ఆ దేశంలో కొత్తగా 2వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 2,008 కేసులు వెలుగు చూసినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 1000కి పైగా కేసులు నమోదవడం ఆ దేశంలో ఇది వరుసగా 73వ రోజు కావడం గమనార్హం. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సహా ఇతర నగరాల్లో గత పది వారాల నుంచి లాక్డౌన్ తరహా ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ కేసులు నమోదవతున్నాయి. ఒక్క సియోల్ నగరంలో కొత్తగా 1500కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. పాఠశాలల పునఃప్రారంభం, వేసవి సెలవులను ముగించుకుని ప్రజలు తిరిగి వస్తుండగా అక్కడ వైరస్ బారినపడే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో చుసియోక్(థ్యాంక్స్ గివింగ్) వేడుకలు.. ఈ వారాంతం నుంచి వచ్చే బుధవారం వరకు కొనసాగునున్న నేపథ్యంలో వైరస్ బారిన పడే వారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో టీకా తీసుకోని వారు.. 60 ఏళ్లు దాటిన తమ తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా పంజా- అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు