ఇరాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్ని ప్రభావితం చేయాలని వీరు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.
"ఇటీవల పాస్ఫరస్ పేరుతో ఉన్న ఒక సైబర్ బృందం కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇది ఇరాన్‌కు చెందిన బృందంగా భావిస్తున్నాం. ఈ బృందం 30 రోజుల వ్యవధిలో కొందరి ఈమెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడానికి 2,700 సార్లు ప్రయత్నించినట్లు తేలింది. మొత్తం 241 ఖాతాలను లక్ష్యంగా చేసుకొన్నట్లు వెల్లడించింది. వీటిల్లో కొన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించినవి, మరికొన్ని ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు, జర్నలిస్టులవి ఉన్నాయి. దేశం వెలుపల ఉంటున్న ప్రముఖ ఇరాన్ వాసులవి కూడా ఉన్నాయి."
-మైక్రోసాఫ్ట్
ఈ ఆరోపణలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. మైక్రోసాఫ్ట్ ప్రకటనపై ట్రంప్ ప్రతినిధి మాట్లాడారు. తాము లక్ష్యంగా మారినట్లు ఎటువంటి సంకేతాలు రాలేదని వెల్లడించారు.
ట్రంప్‌నకు సవాల్
దాదాపు 19 మంది డెమోక్రటిక్ పార్టీ సభ్యులు అధ్యక్ష పదవికి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుండగా.. రిపబ్లికన్‌పార్టీ నుంచి ముగ్గురు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని సవాలు చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: గాంధీ 150: ఈటీవీ భారత్ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ