అమెరికాకు చెందిన డేవిడ్.. డైమండ్ ఏవియేషన్ క్లబ్ పైలట్. ఓ రోజు.. మెంఫిస్ ప్రాంతానికి 50 కి.మీలు ఉత్తరాన ఉన్న పంటపొలాలపై విమానం ఉండగా.. మేఘాలు ఏర్పడటాన్ని చూశాడు డేవిడ్. ఆ దృశ్యాలను బంధించడానికి.. వెంటనే తన ఐఫోన్ ఎక్స్ ఫోన్‌ను బయటకు తీశాడు. విమానం కిటికీ తీసి.. ఫోన్ కొద్దిగా బయటకు పెట్టాడు. ఇలా చేయడం డేవిడ్‌కు అలవాటే. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాడు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. గాలికి ఫోన్ అతని చేతులో నుంచి జారిపోయింది. అంతే.. 11వేల 500 అడుగుల ఎత్తు నుంచి ఐఫోన్ ఎక్స్ కిందపడిపోయింది.
చేసేదేమీ లేక డేవిడ్ ఫోన్‌పై ఆశలు వదులుకున్నాడు. ఆ ఫోన్ పాత పడిపోయిందని, కొత్త 5జీ మోడల్ ఫోన్ తీసుకోవచ్చులే అనుకుని సద్దిచెప్పుకున్నాడు. ఐఫోన్ ఎక్స్ పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడు.
అసలు కథ ఇక్కడే మొదలైంది...
ఇంటికి వెళ్లిన డేవిడ్.. తన యాపిల్ ఆకౌంట్ నుంచి ఆ ఐఫోన్ ఎక్స్‌ను తొలగించాలని ప్రయత్నించాడు. సెట్టింగ్స్‌లో ఉండగా.. ఆ ఐఫోన్ ఎక్స్ లొకేషన్ కనపడింది. బ్లైత్ అర్కాన్సాస్ ప్రాంతంలో చివరగా ఆ ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయ్యింది.
షాక్ అయిన డేవిడ్.. ఫోన్‌ను తెచ్చుకునేందుకు విమానంలో బయలుదేరాడు. డేవిడ్ వెంట అతని స్నేహితుడు డీన్ కూడా ఉన్నాడు.
ఇదీ చూడండి:- యాపిల్ ఉత్పత్తుల పేర్లన్నీ 'ఐ'తోనే! ఎందుకలా?
బ్లైత్ అర్కాన్సాస్ ప్రాంతానికి సమీపంలోని విమానాశ్రయం వరకు వెళ్లిన డేవిడ్, డీన్.. అక్కడి నుంచి 30మైళ్లు వాహనంలో ప్రయాణించారు. ఫోన్ చివరగా ట్రేస్ అయిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికి ఆ ఫోన్ స్విచ్ఆఫ్ అయిపోయింది.
ఆ ప్రాంతం సోయాబీన్, వరి పంటలతో నిండి ఉంది. చేసేదేమీ లేక ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టారు ఆ స్నేహితులు. గంటసేపు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇక వెనక్కి వెళ్లిపోదాము అనుకున్న సమయానికి.. సెల్‌ఫోన్ టవర్‌కు సమీపంలోని పొదల్లో ఐఫోన్ ఎక్స్ దొరికింది. 11,500 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా.. ఆ ఫోన్ చెక్కుచెదరకుండా అలాగే ఉండటం ఒక గొప్ప విశేషమైతే.. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అది మునుపటిలాగే పనిచేస్తుండటం మరో విశేషం.
ఓవైపు ఫోన్ పగలలేదన్న షాక్.. మరోవైపు అది దొరికిందన్న ఆనందంతో డేవిడ్ ఇంటికి వెళ్లాడు.
అలా ఎలా...?
అంత ఎత్తునుంచి కిందపడినా ఫోన్‌కు ఏమీకాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ఓటర్బాక్స్ డిఫెండర్ సిరీస్ ఫోన్ కేస్. 2018లో ఫోన్ కేస్‌ను కొన్నాడు డేవిడ్. అదే ఇప్పుడు ఆ ఫోన్‌ను బతికించింది.
ఈ కథ చెబుతూ.. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్న ఐఫోన్‌కు ధన్యవాదాలు తెలిపాడు డేవిడ్.
ఇదీ చూడండి:- బాలుడి చేతికి ఫోన్- లక్షల కారు అమ్ముకున్న తండ్రి!