కరోనా ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అంతకంతకూ విస్తరిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. చిరుజల్లులా మొదలైన కరోనా బాధితుల సంఖ్య నేడు మహాసంద్రాన్ని తలపిస్తోంది. ఈ మహమ్మారి ఇంతలా విజృంభించడానికి కారణం దీనికి మందు లేకపోవడమే.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే దిశలో వివిధ దేశాలు తలమునకలై ఉన్నాయి. ఎంత వేగంగా వ్యాక్సిన్ కనిపెట్టినా అందుబాటులోకి వచ్చేసరికి ఏడాది పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయలేమా? అంటే మాత్రం వైద్యులు తాత్కాలిక విధానాలను సూచిస్తున్నారు. గతంలో ప్రబలిన అంటువ్యాధుల నియంత్రణలో కీలకపాత్ర పోషించిన రోగ నిరోధకాల మార్పిడి విధానమే ఉత్తమమని విశ్వసిస్తున్నారు.
కోలుకున్నవారి ప్లాస్మా నుంచి..
రోగ నిరోధకాల మార్పిడి విధానం ప్రకారం... కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోనున్న రోగ నిరోధకాలను కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న వారికి అందిస్తే వారి శరీరానికి వైరస్‌తో పోరాడే శక్తి లభిస్తుంది.
చైనాకు చెందిన సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆచార్యులు.. వుహాన్‌లోని 5 మంది కరోనా బాధితులపై పరిశోధన చేశారు. వెంటిలేటర్లతో చికిత్స అవసరం ఉన్నవారికి ఈ పద్ధతి ద్వారా రోగ నిరోధకాలను శరీరంలోకి ఎక్కించారు. తద్వారా వారు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో నలుగురు 12 రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారు.
కొంత మేర ప్రయోజనమే..
ప్రఖ్యాత ఫెయిర్లీ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యాధి కారకం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేయడానికి రోగ నిరోధక శక్తి.. ప్రతిరక్షకాలను జనించేలా చేస్తుంది. ఆ ప్రతిరక్షకాలు ఆ వ్యాధి కారకాన్ని నాశనం చేస్తాయి. అనంతరం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఆ ప్రతి రక్షకాలు మన శరీరంలో అలాగే ఉంటాయి.
అంటే ఒక వ్యక్తిలోని రోగ నిరోధకాలను మరో రోగికి ఇస్తే... ఆ వ్యక్తి శరీరంలోనూ రోగ నిరోధకాలు జనించి వ్యాధి కారకాలపై పోరాడతాయి. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాను కొంత కట్టడి చేయవచ్చని విశ్లేషించింది జార్జియాకు చెందిన ఏమోరి విశ్వవిద్యాలయం.
మరణాలను తగ్గించవచ్చు..
అమెరికాలోని 'జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్' పత్రిక దీని గురించి కూలంకుషంగా వివరించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కరోనా సోకగా వేలాది మంది మరణించారు. సానుకూలాంశం ఏమిటంటే బాధితుల్లో 85 % మంది కోలుకుంటున్నారు. అంటే వీళ్లందరిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉందన్నమాట.
వారి రక్తంలో ఉండే ప్రతి రక్షకాలు కొత్తగా శరీరంలోకి వచ్చిన కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొన్నాయి. ప్రస్తుతానికైతే కరోనాకు మందు లేదు. ఈ పరిస్థితుల్లో వైద్యులు చూస్తున్న ప్రత్యామ్నాయం ఈ విధానమే. దీని ద్వారా కొంత మేర కరోనా మరణాలను తగ్గించవచ్చని అభిప్రాయపడింది.
1900ల్లోనే అందుబాటులోకి..
రోగ నిరోధకాల మార్పిడి విధానం కొత్తదేమీ కాదు. 20వ శాతబ్దం తొలినాళ్లలోనే అందుబాటులోకి వచ్చింది. అంటువ్యాధులు ప్రబలిన ప్రతిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసరికి ఎందరో మృతి చెందేవారు.
అలాంటి పరిస్థితుల్లో ఆ అంటువ్యాధి నుంచి కోలుకున్న వారి శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉంటాయి. వాటిని ఇతరులకు అందించడం ద్వారా వారి శరీరంలోనూ ఈ వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఈ పద్దతితోనే స్పానిష్ ప్లూ, కలరా, తట్టు, గవద బిళ్లల సమయంలో మరణాల రేటును తగ్గించగలిగారు.
వివిధ మహమ్మారుల విషయంలో..
న్యూయార్క్‌లోని 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్' పత్రికలోని వ్యాసం ప్రకారం.. 20వ శతాబ్ద తొలినాళ్లలోనే కాదు, ఇటీవలి కాలంలో ప్రబలిన అంటువ్యాధులనూ ఈ విధానంతో నియంత్రించారు. 2003 లో వచ్చిన సార్స్, 2009లో వచ్చిన స్వైన్ ప్లూ, 2012లో వచ్చిన మెర్స్ వంటి వ్యాధుల నియంత్రణలో ఈ పద్ధతిని ఉపయోగించే ఎందరో ప్రాణాలను కాపాడారు.
వీటి ద్వారా మనకు తెలిసిందేంటంటే... ఇలా ప్రతినిరోధకాలను మార్పులు చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గి... బతికే అవకాశాలు మెరుగవుతాయి. ఆఫ్రికాలో ప్రకంపనలు సృష్టించిన ఎబోలా నియంత్రణలోనూ ఈ విధానమే కీలక పాత్ర పోషించింది.
సిద్ధమవుతున్న అమెరికా..
ఈ విధానం గురించి కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వైద్యులు అందరికీ ఇది సుపరిచితమే. అమెరికాలో అత్యంత ప్రభావితమవుతన్న న్యూయార్క్ నగరంలో మరికొన్ని రోజుల్లో ప్లాస్మాను సేకరించేందుకు సర్వం సిద్ధం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను సేకరించేందుకు అమెరికాలోని హ్యూస్టన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి అనుమతినిచ్చారు. వ్యాధి నిరోధకాలు ఎంత కాలం కరోనాను ఎదుర్కొంటాయి? ఎంత మోతాదులో ఈ ప్లాస్మాను సేకరించాలి? ఎలా నిల్వ ఉంచాలనే దానిపై విధివిధానాలను రూపొందించే పనిలో వారు నిమగ్నమయ్యారు.
అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం.. "వ్యాక్సిన్ కనిపెట్టేవరకు కరోనా తీవ్రతను తగ్గించాలంచే ఇది ఒక్కటే మార్గం. అస్వస్థతకు గురైనవాళ్లతో పాటు వైద్యసిబ్బందికీ ఇవ్వడం వల్ల వాళ్లకు వైరస్ సోకకుండా అడ్డుకోవచ్చు".
మనకు ఉన్న మార్గం ఇదే..
కొవిడ్ -19 కు వైరస్ వచ్చే వరకు ఆ బాధితుడి శరీరంలో ప్రతిరోధకాలు జనించకపోతే మరణం తథ్యం. అందువల్ల వారికి ఇలా ప్రతి రక్షకాలను ఇవ్వడం వల్ల కరోనాపై పోరాడి ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అంతిమంగా కరోనాను సమూలంగా నిర్మూలించాలంటే మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరి.
ఇదీ చూడండి: 'హోమియోపతితో కరోనాను జయించిన బ్రిటన్ యువరాజు'