అమెరికాలో భారత సంతతి వ్యక్తి.. చారిత్రక హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్) డీన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వరుసగా రెండోసారి వరించింది. ఈసారి శ్రీకాంత్ దాతర్‌ను డీన్‌గా ప్రకటించారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ ల్యారీ బకోవ్. హెచ్బీఎస్కు దాదాపు 25 ఏళ్లపాటు సేవలందించి, ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్న దాతర్.. డీన్ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పదేళ్లుగా డీన్‌గా కొనసాగుతున్న భారత సంతతి నితిన్ నోహ్రియా పదవీకాలం ముగిశాక, వచ్చే ఏడాది జనవరి నుంచి దాతర్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.
"శ్రీకాంత్ విస్తృత అంతర్జాతీయ దృక్పథంతో, వ్యాపార సాధనతో దశాబ్దాలుగా హెచ్బీఎస్కు సేవలందించారు. ఇకపై డీన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. "
-ల్యారీ బకోవ్, హార్వర్డ్ ప్రెసిడెంట్
శ్రీకాంత్ దాతర్ 1996లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఫ్యాకల్టీగా చేరారు. నైపుణ్యం ఉన్న రంగాల నిర్వహణ, వినూత్న బోధనా విధానాలకు శ్రీకారం చుట్టారు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు డీన్ బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకున్నారు.
1973లో బాంబే విశ్వవిద్యాలయం నుంచి బీఏ పాస్ అయిన దాతర్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. గణాంకాలు, ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసి.. స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుంచి వ్యాపారంలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు.
ఇదీ చదవండి: 'ఆ కేరళ విద్యార్థినిని రాష్ట్ర అతిథిగా గౌరవిస్తాం'