బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు దక్కింది. వాతావరణం, విద్యుత్ విభాగంలో నిపుణురాలు అయిన బిదీషా భట్టాచార్య వ్యవసాయ విభాగంలో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు.
ఇదివరకు సెనేటర్ అల్ ఫ్రాంకన్కు విద్యుత్, వ్యవసాయ విభాగాల సీనియర్ సలహాదారుగా నాలుగేళ్లు పనిచేశారు. భారత్‌లోని గ్రామీణాభివృద్ధి కోసం అంకుర సంస్థలతో కలిసి సౌర శక్తి ప్రాజెక్టులు చేపట్టారు.
నీరా టాండెన్ నియామకం..
శ్వేతసౌధం ముఖ్యవ్యూహకర్తల్లో ఒకరిగా ఎంపికైన భారతీయ అమెరికన్ నీరా టాండన్ నియామకం ఆగమ్యగోచరంగా మారింది. అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఉన్నా.. ఆమె సెనేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కి డైరెక్టర్ పదవి చేపట్టడంపై రిపబ్లికన్లు సహా సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో నీరా వ్యవహార శైలి సరిగా లేదని ముగ్గురు రిపబ్లికన్లు, ఓ డెమొక్రాట్ విమర్శించారు. ఆమె నియామకం ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ట్వీట్లను తన ఖాతా నుంచి డిలీట్ చేశారని ఆరోపించారు. దీనిపై ఇదివరకే నీరా సెనేటర్లను క్షమాపణ కూడా కోరారు.
మద్దతు ఇవ్వండి..
టాండెన్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) సెనేటర్లకు లేఖ రాసింది. ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో అనుభవజ్ఞురాలైన నీరాను నియమిస్తే.. అమెరికా అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంది.