ఐక్యరాజ్య సమితిలో ఓ కీలక కమిటీలో చైనాను ఢీకొట్టి భారత్ సభ్యత్వం సంపాదించింది. ఐరాసలోని ‘ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్’(ఈసీఓఎస్‌ఓసీ)కి చెందిన ‘యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ వుమెన్’లో సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో చైనాను ఓడించింది.
లింగ సమానత్వం, మహిళల సాధికారిత కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ విజయం గుర్తింపు వంటిదని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఓటింగ్‌లో భారత్‌కు మద్దతుగా నిలిచిన సభ్యదేశాలన్నింటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీలో 2025 వరకు భారత్‌కు సభ్యత్వం ఉండనుంది.
3దేశాలు బరిలో..
54 సభ్యదేశాలున్న ఈ కమిటీ ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించగా.. ఆసియా-పసిఫిక్ విభాగంలో రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. ఇందులో భారత్, ఆఫ్గానిస్థాన్, చైనా బరిలో నిలిచాయి.
చైనాకు సగం ఓట్లూ రాలేదు..
ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించి భారత్ గెలుపొందగా.. అఫ్గానిస్థాన్ బ్యాలెట్ ఓట్లు సాధించి గౌరవాన్ని నిలబెట్టుకుంది. చైనాకు మాత్రం బ్యాలెట్‌కు కావాల్సిన ఓట్లలో సగం కూడా రాకపోవడం గమనార్హం. చైనా తన దుందుడుకు స్వభావంతో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: 4 చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం