అమెరికాలో ఇడా హరికేన్(ida hurricane) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేటగిరీ-4గా (గరిష్టం కన్నా ఒక దశ తక్కువ) ప్రకటించిన ఈ తుపాను.. మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది(ida hurricane landfall). ఇడా.. న్యూ ఒర్లాన్స్కు దక్షిణాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఫోర్చౌన్ వద్ద తీరాన్ని తాకినట్లు జాతీయ హరికేన్ సెంటర్ ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) వెల్లడించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ఈ హరికేన్ తీరాన్ని తాకే కొన్ని గంటల ముందు నుంచి ఆ ప్రాంతంలో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 241 కిలోమీటర్లుగా ఉంది. హరికేన్ ధాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. దక్షిణ లూసియానాలో 25 నుంచి 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
లూసియానాలో ఇంత ప్రమాదకర స్థాయిలో హరికేన్ రావడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఆగస్టులో కట్రినా హరికేన్(కేటగిరీ- 8) లూసియానా, మిసిస్సిప్పిలను అతలాకుతలం చేసింది. నాటి బీభత్సానికి సుమారు 1800 మంది బలయ్యారు.
బైడెన్ హామీ..
హరికేన్ తీవ్రత తగ్గే వరకు లూసియానా రాష్ట్ర ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్త వహించాలని అధ్యక్షుడు బైడెన్ సూచించారు. ప్రభావిత రాష్ట్రాలైన లూసియానా, అలబామా, మిషిగన్లను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇంకా 300మంది అఫ్గాన్‌లోనే!