కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన అమెరికా ప్రజలను ఆదుకునేందుకు 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన జో బైడెన్ ప్రభుత్వం.. దాని అమలు దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
బిల్లుపై శక్రవారం అర్ధరాత్రి వరకు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ప్రతినిధుల సభ దీనిని 219-212 ఓట్ల తేడాతో ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ సభ్యులు సహా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. త్వరలో.. ఈ బిల్లును సెనేట్ ఆమోదం కోసం పంపనున్నారు.
ఈ ప్యాకేజీ అమలులోకి వస్తే ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ప్రతి అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లను జమ చేస్తారు. నిరుద్యోగులకు ప్రతి వారం అందిస్తున్న 300 డాలర్ల భృతిని 400 డాలర్లకు పెంచుతారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల కోసం 50 బిలియన్ డాలర్లు అందజేస్తారు. రాష్ట్ర, స్థానిక, గిరిజన ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు 200 బిలియన్ డాలర్లను సాయం కింద అందిస్తారు.
ఇదీ చూడండి: 'చైనాలో జరిగే ఒలింపిక్స్‌ను బహిష్కరించండి'