అమెరికాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఆదివారం నాటికి కాలిఫోర్నియాలో 16,840 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జులైలో కరోనా తీవ్ర స్థాయికి చేరినప్పటితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో బాధితులు ఆస్పత్రులలో చేరుతున్నారని అధికారులు తెలిపారు. ఇదే ఉద్ధృతి కొనసాగితే జనవరి రెండు-మూడో వారం నాటికి 75 వేల మంది ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉందని చెప్పారు.
3,610 మంది కరోనా బాధితులు ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియా, సాన్ జోక్విన్ వ్యాలీలో ఐసీయూల సామర్థ్యం మించిపోయింది. కరోనా తీవ్రంగా ఉన్న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ కౌంటీలో.. రోగులకు 10 నిమిషాలకు మించి సమయం కేటాయించలేకపోతున్నామని నర్సులు చెబుతున్నారు. ఆస్పత్రికి వస్తున్న రోగులు గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆరోగ్యం క్షీణిస్తోందని అంటున్నారు. ఈ కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వల్ల మరణిస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆదివారం మరో 161 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 22,593కి చేరింది.
ప్రయాణాల జోరు
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అభ్యర్థనలను ప్రజలు బేఖాతరు చేస్తున్నారని అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే పది లక్షల మంది ప్రజలు విమాన ప్రయాణాలు చేశారని వెల్లడించారు. నవంబర్ 29 తర్వాత తొలిసారి ఇంత మంది ప్రయాణించారని పేర్కొన్నారు. క్రిస్మస్ కారణంగా ప్రయాణాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 3 మధ్య 8.5 కోట్ల మంది వివిధ ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
80 లక్షల డోసులు
కాగా... అమెరికాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. దాదాపు 80 లక్షల డోసులు సోమవారం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 59 లక్షలకు పైగా మోడెర్నా టీకా డోసులు, 20 లక్షల ఫైజర్ డోసులను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, కిరాణా దుకాణాల వర్కర్లకు తర్వాతి దశలో వ్యాక్సిన్ అందించనున్నట్లు పేర్కొన్నాయి.
టీకా తీసుకునేదెప్పుడో..
అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం కరోనా టీకా స్వీకరించనుండగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీకా తీసుకునే విషయంపై అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారుల్లో ట్రంప్ ఒక్కరే ఇప్పటివరకు టీకా స్వీకరించలేదు. ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై వైద్యులతో చర్చిస్తున్నట్లు శ్వేతసౌధ అధికారులు చెబుతున్నారు.
అయితే, కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాతే టీకా ఇవ్వడం మేలని అంటువ్యాధుల నివారణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆగని ట్రంప్ పోరాటం- సుప్రీంలో మరో వ్యాజ్యం