జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఐదు విజయాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కృషి చేయడం ఒకటని అమెరికా శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌లోని బీయరజ్ వేదికగా ఆగస్టు 24-26 మధ్య జరిగిన జీ-7 సమావేశంలో పాల్గొన్న ట్రంప్ స్వదేశానికి చేరుకున్న అనంతరం శ్వేతసౌధం ఈ విధంగా పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన చర్చల్లో భారత్-పాక్‌ల మధ్య సంప్రదింపుల గురించి ట్రంప్ ప్రస్తావించారని పేర్కొంది వైట్‌హౌస్. భారత్-అమెరికాల మధ్య బలమైన ఆర్థిక బంధం కోసం ట్రంప్ ప్రయత్నించారని స్పష్టం చేసింది.
ఐదు విజయాలు ఇవే...
"ఐక్యతా సందేశం, బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం, అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం, ఐరోపా దేశాలతో సుదృఢ వాణిజ్య మైత్రి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి అనేవి ఐదు అతిపెద్ద విజయాలు."
-శ్వేతసౌధం ప్రకటన
మోదీతో సమావేశంలో అఫ్గానిస్థాన్ అంశంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారని శ్వేతసౌధ కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సోమవారం నాటి సమావేశంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆహ్లాదకర సన్నివేశ చిత్రాలను పోస్ట్ చేసింది.
ఇదీ చూడండి: చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!