చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో మొదటి దశ ఫలవంతంగా సాగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటన అమెరికా మార్కెట్లకు సానుకూలతలు తెచ్చి పెట్టింది.
ట్రంప్ ఈ ప్రకటన చేసినప్పటికీ.. ఇరు దేశాల మధ్య అధికారిక ఒప్పందం జరగాల్సి ఉంది. ఇందుకు మరో 3 నుంచి 5 వారాల సమయం పట్టే అవకాశముంది.
ఆరునెలల చర్చల తర్వాత రూపొందించిన వాణిజ్య ఒప్పందం నుంచి చైనా గతంలో వైదొలిగిన కారణంగా ఈ ఏడాది ఇరుదేశాల మధ్య అనిశ్చితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ట్రంప్ ఇంకా ధీమాగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో చిలీ వేదికగా జరిగే సమావేశంలో లాంఛనప్రాయంగా వాణిజ్య ఒప్పందం కుదరొచ్చని ట్రంప్ అశాభావం వ్యక్తం చేశారు.
"మేధో సంపత్తి, ఆర్థిక సేవలు సహా రైతుల కోసం భారీ ఎత్తున 40-50 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తుల కొనుగోలు ఒప్పందం మొదటి దశ చర్చల్లో కుదుర్చుకోనున్నాము. చైనా జరిపిన అతిపెద్ద కొనుగోళ్లతో పోలిస్తే ఇది 3 రేట్లు అధికం." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చైనాతో సాంకేతికత బదిలీ విషయంలోనూ మంచి పురోగతి సాధిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మొదటి దశలో కొన్ని, రెండో దశలో మరికొన్ని సాంకేతికతకు సంబంధించిన అంశాలు చర్చిస్తామన్నారాయన. త్వరగా మొదటిదశ చర్చలు ముగుస్తాయని అశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్‌పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'