భారత్-చైనాల సరిహద్దు వివాదం మరింత ఉద్రిక్తం కాకుండా నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు. భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయగలరా? అన్న ప్రశ్నకు... ఇది తమ పరిధిలో లేని విషయమని స్పష్టం చేశారు.
భారత్-చైనాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"భారత్-చైనాల సరిహద్దు వివాదంపై ఎవరు మధ్యవర్తిత్వం వహించాలో ఐరాస ప్రధాన కార్యదర్శి సూచించలేరు. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ ఆయన పరిశీలిస్తున్నారు. ఈ రెండు ఆసియా దిగ్గజాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు."
- స్టీఫెన్ డుజారిక్, ఐరాస అధికార ప్రతినిధి
భారత్-చైనాలు 3,500 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే లద్ధాఖ్లోని గాల్వన్, ఉత్తర సిక్కింల్లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగింది. దీనితో ఇరుదేశాలు ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి. గాల్వన్ వద్ద భారత్ అక్రమ నిర్మాణాలు చేపడుతోందని చైనా చేస్తున్న ఆరోపణలను భారత విదేశాంగమంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
ఇదీ చూడండి: చైనా భద్రతా చట్టంపై చర్చించాలని ఐరాసకు అమెరికా పిలుపు