ఓ వ్యక్తి గూగుల్ ఎర్త్ చూస్తుంటే ఓ చెరువులో ఏదో ఆకారం కనిపించింది. దానిని జూమ్ చేసి చూస్తే.. నీటిలో మునిగి ఉన్న కారు కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లను చెరువులోకి దింపారు. అందులో నిజంగానే కారు ఉంది. అంతేకాదు.. అందులో ఓ వ్యక్తి అస్థిపంజరమూ లభ్యమైంది.
ఇంతకీ ఆ శవం ఎవరిదీ? ఆ కారు చెరువులోకి ఎలా వెళ్లిందనే మిస్టరీని ఛేదించే క్రమంలో.. 22 ఏళ్ల కిందట మిస్టరీగా మారిన ఓ వ్యక్తి కేసు వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన.
కనిపెట్టిన స్థిరాస్తి వ్యాపారి...
వివరాల్లోకి వెళ్తే... చార్లే ప్రాజెక్ట్ అనే సంస్థ అమెరికాలోని పరిష్కారం కాకుండా మిగిలిపోయిన మిస్టరీ కేసుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ ఎర్త్ కేసును కూడా పేర్కొంది. ఆగస్టు 28న మూన్‌బేకు చెందిన ఓ ప్రాపర్టీ సర్వేయర్ గూగుల్ ఎర్త్‌లో ఆ ప్రాంతాన్ని సర్వే చేస్తుండగా కారు కనిపించింది. ఇప్పటివరకు దీన్ని ఎవరూ కనిపెట్టి ఉండకపోవచ్చు అని చార్లే ప్రాజెక్ట్ తమ నివేదికలో వెల్లడించింది.
ఈ ఘటనపై పామ్ బీచ్ కౌంటీ పోలీస్ అధికారులు కారు నెంబరు ఆధారంగా వివరాలను సేకరించి.. అతడు 1997లో మిస్సయిన 40 ఏళ్ల విలియం మోల్డ్ అని తెలిపారు.
నైట్క్లబ్కని వెళ్లి అదృశ్యం...
విలియమ్ ఎర్ల్ మోల్డ్ 1997 నవంబరులో లాంటనాలోని నైట్‌క్లబ్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని జాడ లేదు. రోజులు గడిచినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 2019 ఆగస్టు వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. తాజాగా ఆ మిస్టరీని ఛేదించారు.
'చెరువులో మునిగిన కారులో అస్థిపంజరం దొరికింది. డీఎన్‌ఏ పరీక్షలు జరిపిన వైద్యులు అదృశ్యమైన మోల్డ్‌కు చెందిన అవశేషాలుగా గుర్తించినట్లు' పోలీసులు తెలిపారు. ఫలితంగా... ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు సాంకేతిక పరిజ్ఞానంతో ఓ కొలిక్కి వచ్చిందని వారు భావిస్తున్నారు.