అమెరికాలో స్వలింగ సంపర్కుల సమస్యలపై పోరాడిన మహిళ 'మార్షా పి.జాన్సన్'. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల కోసం ఆమె విశేషంగా కృషి చేసింది. అందుకే ఆమె సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా నేడు 'న్యూయర్క్ సిటీలో ప్రైడ్ మార్చ్' నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆ వేడుకకు ఆదరణ తగ్గింది. గూగుల్.. జాన్సన్‌కు గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది గూగుల్.
ఇదీ నేపథ్యం...
1945, ఆగస్టు 24న అమెరికాలోని న్యూయర్క్‌లో పుట్టింది మాల్కమ్ మిచెల్ జూనియర్. 1963లో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె.. న్యూయర్క్ సమీపంలోని గ్రీన్విచ్ అనే చిన్న పట్టణానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మార్షా పి.జాన్సన్‌గా పేరు మార్చుకొని అక్కడే ఎల్జీబీటీ హక్కుల కోసం పోరాడింది. తనని డ్రాగ్ క్వీన్‌గా ప్రకటించుకుంది.
1969లో స్టోన్వాల్ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. స్టోన్వాల్ ఇన్ అనే ఓ ఎల్జీబీటీక్యూ బార్లో ఉన్న 200 మంది స్వలింగ సంపర్కులను బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు పోలీసులు. ఆ ఘటనలో దెబ్బలు తిన్న 23 ఏళ్ల జాన్సన్.. పోలీసుల నిరంకుశత్వంపై గళమెత్తింది. అలా మొదలైన చిన్న విప్లవం.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటికీ ఆ రోజున తమ హక్కుల కోసం రోడ్లపై నిరసన ర్యాలీలు చేస్తుంటారు.
మరో సామాజిక కార్యకర్త స్టిల్వియా రివియతో కలిసి గే లిబరేషన్ ఆర్మీ, స్టార్ అనే స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసింది. అమెరికాలో స్వలింగ వ్యక్తులు నడిపిన తొలి సంస్థ ఇదే. 46 ఏళ్ల వయసులో 1992, జులై 6న జాన్సన్ హత్యకు గురైంది.
తొలి విగ్రహాలు..
స్టోన్వాల్ ఘటనకు 2019లో క్షమాపణలు చెప్పిన ప్రభుత్వం.. గ్రీన్విచ్ ప్రాంతంలో వారి సేవలను గుర్తిస్తూ విగ్రహాలు పెట్టేందుకు అంగీకరించింది. ప్రపంచంలో ఎల్జీబీటీ కమ్యూనిటీకి గుర్తుగా ఏర్పాటైన తొలి విగ్రహాలు వీరిద్దరివే కావడం విశేషం.