కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. తాజాగా మొత్తం కరోనా కేసులు కోటీ 9 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 5 లక్షల 24 వేలకు పెరిగింది.
అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా అక్కడ 57 వేల కొవిడ్ కేసులు, 687 మరణాలు సంభవించాయి. కేవలం ఆరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లోనే గురువారం.. 25 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 28 లక్షల 37 వేలకు, మరణాల సంఖ్య లక్షా 31 వేలకు పైగా పెరిగింది.
బ్రెజిల్ అతలాకుతలం
బ్రెజిల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్కడ 47 వేల 9 వందలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా, 1277 మంది మృత్యువాతపడ్డారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగాయి. మరణాల సంఖ్య 61 వేల 990కి చేరింది.
రష్యాలో మరో 6,760 కేసులు నమోదయ్యాయి. 147 మరణాలు సంభవించాయి. మెక్సికోలో గడచిన 24 గంటల్లో 6,741 కేసులు, 679 మరణాలు నమోదయ్యాయి.
కిమ్ హెచ్చరిక
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్... కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పట్ల అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మయన్మార్ గని ప్రమాదంలో 162కు చేరిన మృతులు