ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ బృందంలోని ఉన్నతస్థాయి వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డబ్ల్యూహెచ్ఓపై కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఫౌచీ. వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య సంస్థ చేస్తున్న కృషికి బైడెన్ ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు ఫౌచీ. అదే సమయంలో ఆరోగ్య సంస్థకు పూర్తిస్థాయి నిధులు, సిబ్బందిని అగ్రరాజ్యం అందిస్తుందని స్పష్టం చేశారు.
"డబ్ల్యూహెచ్లో సభ్యదేశంగా అమెరికా కొనసాగుతుందని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. మునుపటి పరిస్థితులను మార్చి, డబ్ల్యూహెచ్ఓకు సహాయం చేస్తాం. సంస్థకు ఆర్థికపరంగానూ మద్దతుగా నిలవాలని అమెరికా యోచిస్తోంది."
--- ఆంటోనీ ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణులు.
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను నిలిపివేసే ఆదేశంపై బైడెన్ సంతకం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఆరోగ్య సంస్థ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్టు గతేడాది ప్రకటించారు ట్రంప్.
ఇదీ చూడండి:- 'చైనా ముప్పుతో భారత్- అమెరికా మైత్రి బలోపేతం'