కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాదినాటికి అందుబాటులోకి వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నట్లు అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ హెడ్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. 25 లక్షల మంది అమెరికన్లు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ ప్రతిస్పందనపై విచారణ చేపట్టిన అమెరికా కాంగ్రెస్ హౌజ్ కమిటీ ముందు ఫౌచీతో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
"ఈ సంవత్సరం ముగిసి 2021లోకి అడుగుపెట్టే సమయానికి టీకా అందుతుందని ఆశిస్తున్నాం. ఇది కల అని అనుకోవడం లేదు. ఇది నిజమనే అనుకుంటున్నా. ఇది వాస్తవమని నిరూపణ అవుతుంది."
-ఆంటోనీ ఫౌచీ, అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ హెడ్
తొందరొద్దు
వ్యాక్సిన్‌కు అమెరికా నియంత్రణ సంస్థ ఆమోదం లభించగానే.. 300 మిలియన్ల మందికి డోసులు అందించే విధంగా 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్' పేరిట కసరత్తులు చేస్తోంది ఆ దేశ రక్షణ శాఖ.
ఈ విషయంపై స్పందించిన ఫౌచీ.. తక్షణమే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నించకూడదని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సిఫార్సుల ఆధారంగా అవసరమైన వారికి ముందుగా అందించాలని చట్టసభ్యులకు సూచించారు. వైరస్ వ్యాప్తి ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగా టీకా అందించాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతీ అమెరికన్‌కు 2021 సంవత్సరంలోనే టీకా లభిస్తుందని పేర్కొన్నారు.
నిరసనలపై
విచారణలో భాగంగా రాజకీయ సంబంధిత ప్రశ్నలను చట్టసభ్యులు సంధించారు. నల్లజాతీయులైన అమెరికన్ల పట్ల పోలీసుల హింసాత్మక వైఖరికి నిరసనగా చేపట్టిన ఆందోళనలు వైరస్ వ్యాప్తికి కారణమైతే.. వాటిని ఆపేయాలా అంటూ ఫౌచీని ప్రశ్నించారు. అయితే ఈ నిరసనలను అరికట్టడం తన బాధ్యత కాదని పేర్కొన్నారు ఫౌచీ. తాను ఎవరికీ అనుకూలంగా లేనని సమాధానమిచ్చారు. మాస్కు ధరించకుండా గుమిగూడితే వైరస్ వ్యాపిస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ వాదనల సందర్భంగా అమెరికాలో ఐరోపా కంటే ఎక్కువ కేసులు ఉన్నట్లు చూపించే చార్ట్‌ను ప్రదర్శించారు చట్టసభ్యుడు క్లైబర్న్. దీనిపై స్పందించిన ట్రంప్... ప్రపంచంలో ఏ దేశం చేయనన్ని పరీక్షలు చేస్తున్నామని, అందుకే ఎక్కువ కేసులు వస్తున్నాయని ట్వీట్ చేశారు.