కళాశాలలో చదువుకునే రోజుల్లో ఓ స్టూడెంట్ తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల తర్వాత.. 'అవును నేను నిన్ను రేప్ చేశాను' అని సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పంపాడు. ఈ మెసేజ్‌లు ఆధారంగా చూపి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై అమెరికా పెన్సిల్వేనియా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితుడిని పట్టుకోవాలని.. మంగళవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
పార్టీ అనంతరం బలవంతం చేసి..
అది 2013 డిసెంబర్. గెట్టిస్బర్గ్ కళాశాలలో ఓ పార్టీ జరిగింది. అక్కడ కనిపించిన ఓ అమ్మాయిని తోటి విద్యార్థి, ఐస్ హాకీ టీమ్ గోల్ కీపర్ ఇయాన్ క్లియరీ ఫాలో అయ్యాడు. ఆమె హాస్టల్ గదిలోకి వెళ్లి రేప్ చేశాడు. అనంతరం బాధితురాలికి క్షమాపణలు చెప్పి.. అక్కడి నుంచి పారిపోయాడు.
వెంటనే ఫిర్యాదు చేసినా..
ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు వెంటనే కళాశాల సంబంధిత పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారానికి సంబంధించిన మెడికల్ పరీక్షలకూ హాజరయ్యారు. కానీ.. బాధితురాలు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నందున కేసుపై విచారణ జరపడం కష్టమని అధికారులు చెప్పారు.
"ఇంత జరిగినా ఏం చేయలేకపోయానే అని నేను చాలా బాధపడ్డాను. అత్యాచారం జరిగిన తర్వాత ఓ బాధితురాలు న్యాయం కోసం ఇలా పోరాటం చేసే పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు."
--బాధితురాలు.
గతేడాది..
ఎనిమిదేళ్ల తర్వాత క్లియరీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా బాధితురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడు. దీంతో బాధితురాలు.. మరోసారి గెట్టిస్బర్గ్ పోలీసులను ఆశ్రయించారు. మెసేజ్‌ల ఆధారంగా.. కేసును రీఓపెన్ చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఫేస్బుక్ ఖాతాతో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ ఫోన్ ఎత్తడం లేదని తెలిపారు.
క్లియరీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ఎక్కడ ఉన్నాడనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వెంటపడిన జింక- నగ్నంగా పరుగో పరుగు!