నకిలీ ఖాతాలపై సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ఫేస్బుక్ మరోసారి ఉక్కుపాదం మోపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 6 నెలల కాలంలో 300 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది.
ఇందులో చాలా మంది యూజర్లకు క్రియాశీల వినియోగదారులుగా మారేందుకు అవకాశం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.
వీటిలో చాలావరకు ఖాతాలను సృష్టించిన నిమిషాల్లోనే నకిలీ ఖాతాలుగా గుర్తించి వాటిని తొలగించినట్లు తెలిపింది ఫేస్బుక్. అయినప్పటికీ కొంత మంది సాంకేతిక లొసుగులను వాడుకుని తప్పించుకున్నట్లు వివరించింది.
"ఈ నకిలీ ఖాతాల వెనుక ఉన్నదెవరు.. ఎందుకు వారు వీటిని సృష్టిస్తున్నారని ఫేస్‌బుక్‌ను మేం అడిగాం. దానికి ఫేస్బుక్ నుంచి సమాధానం రాలేదు. అయితే ఇవి ఒక దగ్గరి నుంచి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య పరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం... ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలకు ఈ ఖాతాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామని ఫేస్బుక్ తెలిపింది."
- బార్బరా, పాత్రికేయురాలు
ఆరు నెలల్లో 5 శాతానికి...
గతంతో పోలిస్తే నకిలీ ఖాతాల సంఖ్య రెండింతలు పెరిగినట్లు ఫేస్బుక్ తెలిపింది. నెలకు 2.4 బిలియన్ల క్రియాశీల వినియోగదార్లు ఉండగా వారిలో దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉండొచ్చని ఫేస్బుక్ అంచనా వేసింది. 6 నెలల ముందు నకిలీ ఖాతాలు 3 శాతం నుంచి 4 శాతం మధ్య ఉన్నట్లు వెల్లడించింది.
ఫేస్‌బుక్‌కు సవాళ్లు
భారీగా పెరుగుతున్న నకిలీ ఖాతాల కారణంగా అసత్యాలు, అనుచిత ప్రచారాలను అడ్డుకునేందుకు తమకు భారీ సవాళ్లు ఎదురైనట్లు ఫేస్బుక్ తెలిపింది. నకిలీ ఖాతాలను నిలువరించడంలో కృత్రిమ మేధతో పాటు తమ ఉద్యోగులు కృషి చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది.
ఫేస్బుక్ కేంద్రంగా హింస, ఎన్నికల్లో జోక్యం, విద్వేషపూరిత ప్రకటనలు వంటి సవాళ్ల నేపథ్యంలో 70 లక్షల పోస్టులు, ఫొటోలను కూడా తొలగించినట్లు ఫేస్బుక్ వెల్లడించింది.