కరోనా కారణంగా పలు ప్రపంచ దేశాలు విధించిన లాక్‌డౌన్‌ను... ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకొని యువతను తమలో చేర్చుకుంటున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. యువతలో నెలకొన్న కోపం, నిరాశను ఆసరాగా చేసుకుని వారిని ఆకర్షించేందుకు ఉగ్ర మూకలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రమూకలు ఎర వేస్తున్నాయని తెలిపిన గుటెరస్.. ఈ సంక్షోభం వల్ల ఓ తరాన్ని కోల్పోవడం ప్రపంచం భరించలేదన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న వారే లక్ష్యంగా... ద్వేషాన్ని వ్యాపింపజేసి తద్వారా తమలో చేర్చుకుంటున్నాయని వివరించారు.
ప్రస్తుత సంక్షోభం కన్నా ముందే యువత ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. అధికారంలో ఉన్నవారు పట్టించుకోకపోవడం, రాజకీయ పార్టీలపై విశ్వాసం కోల్పోవడం వల్ల తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని గుటెరస్ అన్నారు. సంక్షోభం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు యువత నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు.