అమెరికా అధ్యక్ష ఎన్నికలు డిసెంబర్ 3నే ముగిశాయి. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయ సాధించినట్లు మీడియా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే అగ్రరాజ్యం నూతన అధ్యక్షుడు ఎవరో తేల్చే అధికారిక ప్రక్రియ సోమవారమే ప్రారంభం కానుంది. కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఎలక్టోరల్ కాలేజీ ఇవాళే సమావేశం అవుతుంది. అంటే.. ఆయా రాష్ట్రాల్లో గెలుపొందిన ఎలక్టోరళ్లు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ ఇది.
1787లో రాజ్యంగ సదస్సులో ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు(ప్రజలు పత్యక్షంగా వేసే ఓట్లు) ద్వారా అధ్యక్షుని ఎన్నిక జరగాలని, ప్రజల ప్రమేయం లేకుండా అధ్యక్షుని ఎన్నిక ఉండాలని కోరుకునే వారి మధ్య సమతుల్యం కోసం ఈ ప్రక్రియను తీసుకొచ్చారు.
అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అధ్యక్షునిగా గెలుపొందాలంటే 270 ఓట్లు అవసరం. అమెరికా మీడియా ప్రకారం బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా ట్రంప్ 232 స్థానాల్లోనే గెలిచారు. పాపులర్ ఓట్లలోనూ ట్రంప్ కంటే బైడెన్ 70లక్షలకు పైగా అధిక ఓట్లు సాధించారు.
అత్యధిక పాపులర్ ఓట్లు వచ్చిన వారినే అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎలక్టార్స్ ఎన్నుకోవాలని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో పాటు అమెరికాలోని 32 రాష్ట్రాల్లో నిబంధన ఉంది. ఎలక్టార్స్ బ్యాలెట్ పద్దతిలో రెండు ఓట్ల ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.
ఎలక్టోరల్ కాలేజీ సమావేశం అనంతరం ఈ ఓట్లను జనవరి 6న అమెరికా కాంగ్రెస్లో సమీక్షిస్తారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఉభయ సభలో అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ ఓట్లలో స్పష్టమైన మెజారిటీ ఉన్న జో బెైడెన్ ఎన్నిక లాంఛనమే కానుంది.
ఆ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువే!
అమెరికా రాజ్యాంగం ప్రకారం జనవరి 20న పాత అధ్యక్షుడి పదవీకాలం ముగిసి, పదవి నుంచి దిగిపోవాలి. కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాలి. ఈ లోపు అధ్యక్షుడెవరో తేలకుంటే ప్రతినిధుల సభ స్పీకర్ అధ్యక్షుడు ఎవరో నిర్ణయిస్తారు. ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలు చాలా చాలా స్వల్పం!
అధ్యక్ష ఎన్నికలో అవినీతి బేరం
పాపులర్ ఓట్లు వచ్చినా, ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చినా.. అధ్యక్ష పీఠం అధిరోహించలేని విచిత్ర పరిస్థితి తలెత్తింది 1824లో! ఆండ్రూ జాక్సన్, క్విన్సీఆడమ్స్‌ల మధ్య పోరులో ఎలక్టోరల్ కాలేజీలో ఎవరికీ మెజార్టీ రాలేదు. దాంతో... రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ప్రతినిధుల సభ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి స్పీకర్ హెన్రీ క్లేకు జాక్సన్ అంటే పడదు. దీంతో, సభ్యులతో మాట్లాడి ఆడమ్స్‌ను గెలిచేలా చేశారు. అదే ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రి అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో దీన్ని అవినీతి బేరంగా పేర్కొంటారు. దీని తర్వాతే అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ రూపుదిద్దుకుందంటారు.