అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎవరో అధికారికంగా నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ సమావేశం పూర్తయింది. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎలక్టార్స్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. తదుపరి అధ్యక్షుడిగా జో బైడన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎలక్టార్స్ ఎన్నుకున్నారు. అయితే ఈ ఓట్లను జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌లో సమీక్షించి నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 20న ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది.
ట్రంప్ పోరాటం ముగిసినట్లే..
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్ చేసిన న్యాయపోరాటం ముగిసింది. ఎలక్టోరల్ కాలేజీ జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఇక ట్రంప్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీ పరంగా రెండింటిలోనూ ట్రంప్ ఓడిపోయారు.
అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అధ్యక్షునిగా గెలుపొందాలంటే 270 ఓట్లు అవసరం. అమెరికా మీడియా కథనం ప్రకారం.. బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా ట్రంప్ 232 స్థానాల్లోనే గెలిచారు. పాపులర్ ఓట్లలోనూ ట్రంప్ కంటే బైడెన్ 70లక్షలకు పైగా అధిక ఓట్లు సాధించారు.
2016 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఎలక్టోరల్ కాలేజీలో జో బైడెన్‌కు ఓటు వేశారు. ఆమె న్యూయార్క్ నుంచి ఎలక్టార్ మెంబర్‌గా ఉన్నారు.
ఎలక్టోరల్ కాలేజీని రద్దు చేయాలని నేను భావిస్తున్నాను. పాపులర్ ఓటు ద్వారా అధ్యక్ష విజేతను ఎన్నుకోవడం సరైన నిర్ణయం. కానీ ఈ ప్రక్రియ ఉంది కనుక.. నేను జో బైడెన్, కమలా హారిస్‌కు ఓటు వేశాను. ఇందుకు గర్వపడుతున్నాను.
- హిల్లరీ క్లింటన్, డెమొక్రాటిక్ నేత
ప్రజాస్వామ్యం గెలిచింది..
ఎలక్టోరల్ కాలేజీ తనను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు.
"అమెరికా అంతరాత్మ కోసం జరిగిన ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యం గెలిచింది. మన వ్యవస్థపై మనకున్న విశ్వాసం నిలుపుకున్నాం. మన దేశ ఎన్నికల సమగ్రతను కాపాడుకున్నాం. ఇక అమెరికాను పునరుద్ధరణ చేయడంలో ఐకమత్యంగా పనిచేద్దాం.
నాకు, కమలా హారిస్‌కు దాదాపు 8.1కోట్ల మందికి పైగా ఓటు వేశారు. ఇది అమెరికా చరిత్రలోనే ఓ ఘనవిజయం. దాదాపు 70లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచాం. 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించాం. నేను విజయం సాధించానని తెలుసుకోని వారు.. ఇప్పుడు తెలుసుకుంటారు."
- జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు