అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. శాంటాక్రూజ్ దీవిలోని ఈ బోటు స్కూబా డైవింగ్‌కు చెందింది. అకస్మాత్తుగా పడవకు మంటలు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 26 మంది ఆచూకీ గల్లంతైంది. వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో ప్రయాణికులు పడవ కింది భాగంలో ఉన్న కారణంగా.. వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని తీర రక్షణదళ అధికారులు తెలిపారు. ఎవరైనా సజీవంగా ఉంటే రక్షించేందుకు రక్షణ దళాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్లు, చిన్న పడవలు, కోస్టల్ గార్డ్ పడవలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ప్రమాదానికి గురైన పడవలో ఐదుగురు సిబ్బందితో కలిపి మొత్తం 39 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. పడవ సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే బయటకు దూకడం వల్ల వారిని రక్షించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: డోరైన్ తుపానుకు బహమాస్ అతలాకుతలం