కరోనా ప్రభావం రెండేళ్ల వరకు ఉండే అవకాశం ఉందని అమెరికాలోని వ్యాధుల(మహమ్మారుల) నిపుణుల బృందం అంచనా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి కనీసం 18-24 నెలలు ఉండొచ్చని.. అమెరికాలో 5 నుంచి 15 శాతం మంది దీనిబారిన పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి క్రమేపీ 2021లో ఏదో ఒక సమయానికి బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ ఇన్‌పెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం గురువారం ఈ మేరకు నివేదికను వెలువరించింది. ‘భవిష్యత్తులో కొవిడ్-19 మహమ్మారి: ఇన్‌ఫ్లుయాంజా నుంచి నేర్చుకున్న పాఠాలు’ పేరిట ఈ నివేదికను రూపొందించింది.
"మనం మరిన్ని అంటువ్యాధులను చూస్తాం. సందేహమే లేదు. కేసుల పెరుగుదలతో పెద్ద సవాళ్లు ఎదుర్కొంటాం."
--- మైఖెల్ ఆస్టర్హోల్, సీఐడీఆర్‌ఏపీ డైరెక్టర్
ముఖ్యాంశాలు..
- వేసవి తర్వాత, శీతాకాలంలోనూ కొవిడ్ విజృంభించవచ్చు. ఇది కొత్త వైరస్ కావడం వల్ల దీన్ని ఎదుర్కొనేందుకు ప్రజల్లో రోగ నిరోధక శక్తి లేదు. క్రమేపీ మనుషుల్లో ఆ శక్తి(హెర్డ్ ఇమ్యూనిటీ) పెరుగుతుంది.
- కొవిడ్‌కు టీకా రాని నేపథ్యంలో దుర్భర పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని కాపాడేలా అన్ని ప్రాంతాల్లో పక్కాగా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
- వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా సీజనల్‌గా వచ్చే అవకాశం ఉంది.
- కొత్త కరోనా వైరస్ (సార్స్-కొవ్-2), ఫ్లూ వైరస్‌ల కంటే చాలా విధాలుగా భిన్నమైంది. ఇంకుబేషన్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాపకింద నీరులా వ్యాపిస్తోంది.