కొవిడ్-19 బారినపడిన గర్భిణులకు నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు 'ద లాన్సెట్ రీజినల్ హెల్త్'లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
కరోనా సోకిన గర్భిణులకు.. గర్భం ధరించిన 32 వారాల లోపే కాన్పు అయ్యే అవకాశం 60 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. 37 వారాల లోపు ప్రసవం జరిగేందుకు 40 శాతం అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కొవిడ్-19తోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలున్న గర్భిణులకు నెలలు నిండకుండా కాన్పు అయ్యే ముప్పు 160 శాతం ఎక్కువని పరిశోధనకు నాయకత్వం వహించిన డెబోరా కారాసెక్ తెలిపారు. గర్భిణులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని కోరారు.