అమెరికా క్యాపిటల్ భవనంలో జరిగిన ఘర్షణను అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ఖండించారు. ప్రజాస్వామ్యం అసాధారణ దాడికి గురైందన్నారు. టీవీ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇప్పుడు ప్రజాస్వామ్యంపై అసాధారణ దాడి జరిగింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ప్రజా ప్రతినిధులను క్యాపిటల్ హిల్ పోలీసులు కాపాడడాన్ని మనం చూశాం. చట్టంపై జరిగిన ఈ దాడిని ఎన్నడూ చూడలేదు. ఆందోళనల సందర్భంగా కనిపించిన దృశ్యాలు నిజమైన అమెరికాను ప్రతిబింబించవు. కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారు. ఇది దేశద్రోహం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.
బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లు తోసుకుంటు లోపలికి చొచ్చుకేళ్లారు. నిరసనకారుల కన్నా పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఈ పరిణామాలు కాల్పులకు దారితీశాయి. ఫలితంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
'అమెరికాకే అవమానం'
అమెరికా క్యాపిటల్ భవనంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింసకు ప్రేరేపించారని మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇది అమెరికాకే మచ్చ అని పేర్కొన్నారు.
"ప్రస్తుత అధ్యక్షుడు క్యాపిటల్లో ప్రేరేపించిన హింసను చరిత్ర గుర్తించుకుంటుంది. చట్టబద్ధంగా జరిగిన ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మన జాతికే అవమానకర, సిగ్గు చేటు ఘటన. అయితే ఈ ఘటన ఆశ్చర్యకరమనుకుంటే మాత్రం మన మీద మనం తమాషా చేసుకుంటున్నట్టే."
--- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.
ఇవీ చూడండి:-