ప్రస్తుత ఓట్ల ఫలితాలు ఎలా ఉన్నా... అమెరికా కొత్త అధ్యక్షుడెవరనేది అధికారికంగా తేలటానికి సమయం పడుతుంది. నిజానికి ఇప్పుడు వచ్చే ఫలితాలేవీ అధికారికం కాదు. అధికారికంగా ఫలితాల వెల్లడికి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గడువుంది. డిసెంబరు 14న ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తుంది. అందుకు వీలుగా డిసెంబరు 8లోపు ఆయా రాష్ట్రాలు ఎలక్టోరల్ కాలేజీ సమావేశంలో పాల్గొనే తమ ఎలక్టర్లను నిర్ణయించుకోవాలి. ఈ గడువునే 'సేఫ్ హార్బర్' గడువు అంటారు. మరి ఆ లోపు న్యాయస్థానాల్లో వివాదాలు తేలుతాయా? ఇప్పుడందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తున్న ప్రశ్న ఇది! ఇప్పటికే 44 రాష్ట్రాల్లో దాదాపు 300కుపైగా కేసులు నమోదయ్యాయి.
పెన్సిల్వేనియాలో..
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఓట్లు స్వీకరించటం పై రిపబ్లికన్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల ముందు కూడా ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. కానీ దానిపై కోర్టులోని 8 మంది న్యాయమూర్తులు 4-4గా విడిపోయారు. ఎటూ తేల్చకుండా తర్వాత చూద్దాం అని వాయిదా వేశారు. ఇప్పుడు తొమ్మిదో న్యాయమూర్తిగా ఇటీవలే ట్రంప్ నియమించిన జస్టిస్ ఆమీ కోనీ బారెట్ బాధ్యతలు చేపట్టారు. ఈసారి తీర్పులో ఊగిసలాటకు అవకాశం లేదు.
"ఎన్నికల తేదీ తర్వాత వచ్చే బ్యాలెట్లను లెక్కించకుండా పక్కనబెట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించే అవకాశం ఉంది. కాని దాని ప్రభావం అంతిమ ఫలితంపై పెద్దగా ఉండకపోవచ్చు" అని ఎలక్షన్ ప్రాజెక్టు డైరెక్టర్ మాథ్యూవేల్ వ్యాఖ్యానించారు. జార్జియా, మిషిగన్‌లలోనూ ఇలాంటి కేసులు పడ్డాయి. వీటన్నింటినీ డిసెంబరు 8లోపు తేల్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో అధ్యక్ష ఎన్నిక మరింత సంక్లిష్టంగా మారుతుంది.
పరిస్థితులు తారుమారైతే...
ఈ గడువు లోపు ఎన్నికల ప్రక్రియలో ఆటంకం (కోర్టు కేసులు ఇతరత్రా ఏమైనా) వచ్చి రాష్ట్ర ఎలక్టర్లను ఎన్నుకోలేని పరిస్థితి వస్తే... ఆ రాష్ట్ర శాసనసభ / గవర్నర్ (కొన్నింటిలో) వారిని నామినేట్ చేసే అవకాశం ఉంది. (2000 సంవత్సరంలో ఫ్లోరిడా విషయంలో జరిగిందదే. ఎన్నికల ఫలితం కోర్టులో ఉండటంతో... ఫ్లోరిడా శాసనసభ తమ ఎలక్టర్‌లను సిఫార్సు చేసి, బుష్‌కు ఓటు వేయాల్సిందిగా కోరింది.)
డిసెంబరు 14న ఎలక్టోరల్ కాలేజీ వేసిన ఓట్లను జనవరి 6న అమెరికా ప్రతినిధుల సభ సమీక్షించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తుంది. ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరికీ మెజార్టీ రాకున్నా, సమం అయినా, ఏదైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించి, ఎవరికీ సరైన మెజార్టీ రాని పరిస్థితి తలెత్తితే... అమెరికా ప్రతినిధుల సభే అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.
ఆ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువే!
అమెరికా రాజ్యాంగం ప్రకారం- జనవరి 20న పాత అధ్యక్షుడి పదవీకాలం ముగిసి, పదవి నుంచి దిగిపోవాలి. కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాలి. ఈ లోపు అధ్యక్షుడెవరో తేలకుంటే ప్రతినిధుల సభ స్పీకర్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలు చాలా చాలా స్వల్పం!
అధ్యక్ష ఎన్నికలో అవినీతి బేరం
పాపులర్ ఓట్లు వచ్చాయి... ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ సీట్లూ వచ్చాయి అయినా అధ్యక్ష పీఠం అధిరోహించలేని విచిత్ర పరిస్థితి తలెత్తింది 1824లో! ఆండ్రూ జాక్సన్, క్విన్సీఆడమ్స్‌ల మధ్య పోరులో (అప్పుడు ఇద్దరూ డెమొక్రటిక్ రిపబ్లిక్ పార్టీ వారే) ఎలక్టోరల్ కాలేజీలో ఎవరికీ మెజార్టీ రాలేదు. దాంతో... రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ప్రతినిధుల సభచేతుల్లోకి వెళ్ళింది. అప్పటి స్పీకర్ హెన్రీ క్లేకు జాక్సన్ అంటే పడదు. దీంతో, సభ్యులతో మాట్లాడి ఆడమ్స్‌ను గెలిచేలా చేశారు. అదే ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రి అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో దీన్ని అవినీతి బేరంగా పేర్కొంటారు. దీని తర్వాతే అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ రూపుదిద్దుకుందంటారు.
ఇదీ చదవండి:'బైడెన్ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'