కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావం కారణంగా.. 2030 నాటికి 20 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పేదరికం బారినపడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్య వంద కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యూఎన్డీపీ కొత్త అధ్యయనం వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వివిధ రంగాల్లో కరోనా ప్రభావాన్ని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.
కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా రానున్న పదేళ్లల్లో 80 శాతం ఉత్పాదకత పడిపోతుందని అంచనా వేసింది యూఎన్డీపీ. ఇది వృద్ధిని పూర్తిస్థాయిలో కోలుకోకుండా చేస్తుందని అధ్యయనం తెలిపింది.
వచ్చే దశాబ్దంలో స్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర పేదరికాన్ని నిరోధించవచ్చని యూఎన్డీపీ అభిప్రాయపడింది. ఎస్డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల 10.46 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడతారని, స్త్రీ పేదరికం 7.40 కోట్లకు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
ఇదీ చూడండి: పేదరిక నిర్మూలనపై బహుముఖ పోరు!