కరోనాకు కేంద్రబిందువైన చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం గణనీయ పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కరోనాకు కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో కరోనాపై యుద్ధాన్నే ప్రకటించారు ఆ దేశ ప్రధాని ఎమాన్యుల్ మెక్రాన్. ఐరోపా సరిహద్దులను మూసివేశారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
కరోనా కారణంగా చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల తర్వాత తీవ్ర ప్రభావం స్పెయిన్‌పై పడింది. ఆ దేశంలో ఒక్క రోజులోనే కరోనా కేసుల సంఖ్య 20శాతం పెరిగింది.
కరోనాపై ప్రపంచ దేశాల చర్యలు..
- ఐరోపా దేశాల సరిహద్దులను 30రోజుల పాటు మూసివేశారు
- రష్యా సరిహద్దులను మూసివేసింది.
- ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు ప్రజలపై ఆంక్షలు విధించాయి.
- రెండు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించింది.
- అమెరికాలోని న్యూజెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కర్ఫ్యూ విధించారు.
- జర్మనీలో ప్రార్థనా మందిరాలు, క్రీడా స్థలాల్లో ప్రజలు ఉండకుండా చర్యలు తీసుకున్నారు.
- కెనడా సరిహద్దులను మూసివేసింది. అమెరికన్లను తప్ప విదేశీయులను అనుమతించడం లేదు.
- జీ-7 దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా కట్టడి చర్యలపై చర్చించారు.
- బ్రిటన్‌లో మాత్రం ఇంకా పాఠశాలు, రెస్టారెంట్లు, బార్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
ఆర్థిక వ్యవస్థ పతనం..
కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్రరాజ్యం సహా, ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.
కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమల ఫలితాలు 30ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.
అంతకంతకూ తీవ్రరూపం
- ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటివరకు 7,174మంది మృతి చెందారు
- చైనాలో మృతుల సంఖ్యం 3,226కు చేరింది.
- 162 దేశాలకు వైరస్ వ్యాపించింది. లక్షా 82వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
- ఇటలీలో ఒక్కరోజే 3,200కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 28వేలకు పెరిగింది. 349మంది చనిపోయారు.
- ఇరాన్లో సోమవారం ఒక్కరోజే 129మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 853. వెయ్యికి పైగా కొత్త కేసులు.
- స్పెయిన్‌లో ఒక్కరోజే 48మంది మృతి. కొత్తగా 1,694 కేసులు.
- ఫ్రాన్స్‌లో 21మంది మృతి. మొత్తం కేసులు 1,210
- బ్రిటన్‌లో ఒక్కరోజే 20మంది చనిపోగా, 152మందికి వైరస్ సోకింది.
- అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 91కి పెరిగింది. 4,700మంది వైరస్ బారిన పడ్డారు.
- మలేసియాలో 315 కొత్త కేసులు నమోదు సహా మొత్తం సంఖ్య 553కు పెరిగింది.