శ్వాసకోశ వ్యవస్థలో కరోనాతో కలిగే ఇన్‌ఫెక్షన్ తీరును సచిత్రంగా అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ల్యాబ్‌లో వృద్ధి చేసిన శ్వాస కోశ కణాల్లో ఈ వైరస్ విజృంభణకు సంబంధించిన చిత్రాలను క్లిక్‌మనిపించారు. ఊపిరితిత్తుల్లోని ఒక్కో కణంలో ఎన్ని వైరస్ రేణువులు ఉత్పత్తవుతాయన్నది కూడా వారు ఆవిష్కరించారు. ఉత్తర కరోలైనా విశ్వవిద్యాలయంలోని చిన్నారుల పరిశోధన సంస్థకు చెందిన క్యామిలె ఎహ్రె నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
మాస్క్ తప్పనిసరి...
శ్వాస నాళాల్లో కరోనా ఇన్‌ఫెక్షన్ తీవ్రతను ఈ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. ఊపిరితిత్తుల్లోని మానవ బ్రాంకియల్ ఎపిథీలియల్ కణాలను కరోనా వైరస్‌కు శాస్త్రవేత్తలు గురిచేశారు. 96 గంటల తర్వాత శక్తిమంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు సాయంతో వీటిని పరిశీలించారు. అక్కడ ఉత్పత్తయిన వైరస్ నిర్మాణం, సాంద్రతను విశ్లేషించారు. ఇవి పూర్తిగా సాంక్రమిక రూపంలో ఉన్నాయని తేల్చారు. ఒక్కో కణంలో ఉత్పత్తవుతున్న వైరస్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. వైరల్ లోడు అధికంగా ఉండటం వల్ల ఆ సూక్ష్మక్రిములు ఇతర అవయవాలకు, వ్యక్తులకు సంక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇన్‌ఫెక్షన్ సోకిన వారు, సోకని వారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా విలయం- 2.91 కోట్లు దాటిన కేసులు