విదేశీ విమానాలపై ఆదివారం నుంచి తాత్కాలికంగా నిషేధం విధించింది భారత్. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండే భారతీయులు సురక్షితంగా, ఇళ్లలోనే ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేసింది. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రందించాలని పేర్కొంది. ఆంక్షల సమయంలో వీసా పొడిగింపు కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 230 మంది మరణించారు. 18 వేల మందికి వైరస్ సోకింది. ఆ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు వైరస్ వ్యాపించింది. దీనిని నిలువరించేందు కఠిన చర్యలు చేపడుతోంది ట్రంప్ ప్రభుత్వం.
రక్షణ మంత్రి ప్రశంసలు
కరోనా పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్. కరోనా నియంత్రణకు ఆసియా దేశాలు కలిసి పోరాడాలని భారత్ తీసుకున్న చొరవను కొనియాడారు.
ఈ నెలలోనే భారత్‌లో పర్యటించాల్సి ఉంది ఎస్పర్. కరోనా కారణంగా పర్యటన వాయిదా పడింది. పరిస్థితులు మెరగుపడ్డాక వీలైనంత త్వరగా ఆయన భారత్‌కు వస్తానని చెప్పారు.