త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు విదేశీ శక్తులు యత్నిస్తున్నాయని గూగుల్ వెల్లడించింది. దీనికి హ్యాకింగ్‌ను సాధనంగా వాడుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రత్యర్థి జో బిడెన్ ప్రచార బృందాలకు చెందిన ఈ-మెయిళ్లను హ్యాక్ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు పేర్కొంది. ప్రమాదాలను పసిగట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే గూగుల్ 'త్రెట్ అనాలసిస్ గ్రూప్' డైరెక్టర్ షేన్ హంట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆ విదేశీ శక్తులెవరంటే..
అమెరికా నోట్లో ఈ మధ్య బాగా నానుతున్న దేశాల్లో చైనా, ఇరాన్ ముందున్న సంగతి తెలిసిందే. వీటిపై ట్రంప్ ఓ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇరాన్‌పై ఇప్పటికే కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైరస్ విషయంలో చైనా దిగిరాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించారు. తాజాగా ఈ రెండు దేశాలే ట్రంప్‌పై కక్ష తీర్చుకునేందుకు యత్నిస్తున్నట్లు గూగుల్ పరిశీలనలో తేలింది. చైనాకు చెందిన 'హరికేన్ పాండా' ట్రంప్ ప్రచార బృందాన్ని లక్ష్యంగా చేసుకోగా.. ఇరాన్‌కు చెందిన 'చార్మింగ్ కిటెన్' బిడెన్ గ్రూప్‌ను ప్రభావితం చేసేందుకు యత్నించినట్లు గూగుల్ పేర్కొంది.
ఎలా.. ఎన్నిసార్లు..
పాస్‌వర్డ్‌లను దొంగిలించేలా.. వారి కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో మాల్వేర్‌ను చొప్పించేలా లింకులను నకిలీ సందేశాల ద్వారా పంపేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే, ఇవన్నీ విఫలమైనట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, ఇలా ఎన్నిసార్లు, ఎంత మందిని లక్ష్యంగా చేసుకున్నారన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేదు. వీటిపై ట్రంప్ బృందం స్పందిస్తూ.. "విదేశీ శక్తులు మా ప్రచార సభ్యుల సాంకేతికతను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశాయని మాకు తెలుసు. ఇలాంటి సైబర్‌దాడులపై మేం అప్రమత్తంగా ఉన్నాం. అయితే, మేం తీసుకుంటున్న జాగ్రత్తల్ని మాత్రం చెప్పబోం" అని తెలిపింది. బిడెన్ బృందం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్ష్యంగా మారిన వ్యక్తులకు హెచ్చరిక సందేశాలను జారీ చేశామని గూగుల్ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు వెల్లడించింది.
ప్రమాదకరమైన మాల్వేర్లే పాండా సాధనాలు..
హరికేన్ పాండా చైనా కేంద్రంగా పనిచేస్తున్నట్లు సెక్యూరిటీ పరిశోధకులు భావిస్తున్నారు. దీనికి అక్కడి ప్రభుత్వ మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. 'జిర్కోనియం', 'ఏపీటీ 31' దీనికి పరిశోధకులు ఇచ్చిన పేర్లు. ఆపరేషన్ 'అంబ్రెల్లా రెవల్యూషన్', 'పాయ్‌జండ్ హరికేన్' పేరిట గతంలో పలు భారీ సైబర్ దాడులకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. సమాచారసాంకేతిక వ్యవస్థ, రహస్య మేధోపరమైన సమాచారాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. ఇంటర్నెట్, ఇంజినీరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలు వీటి ప్రధాన లక్ష్యం. అత్యంత ప్రమాదకరమైన 'రిమోట్ యాక్సెస్ ట్రోజన్'(ర్యాట్) రకానికి చెందిన సకులా ఘోస్ట్, ప్లగ్‌ఎక్స్, హికిట్, మిమికాట్జ్ వంటి మాల్వేర్లు పాండా సాధనాలు. వీటి ద్వారా లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి కంప్యూటర్ లేదా నెట్‌వర్క్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వస్తుంది.
అమెరికా రక్షణ వ్యవస్థపై దాడితో వెలుగులోకి కిటెన్..
పాస్ఫరస్, అజాక్స్ సెక్యూరిటీ, న్యూస్‌బీఫ్, ఏపీటీ 35 చార్మింగ్ కిటెన్‌కున్న మరికొన్ని పేర్లు. కంపెనీల నకిలీ వెబ్‌సైట్లు, ఖాతాలు, డీఎన్‌ఎస్‌ల ద్వారా ఇది హ్యాకింగ్‌కి పాల్పడుతుంటుంది. దీనికి ఇరాన్ మద్దతు ఉన్నట్లు సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అమెరికా వాయుసేనలో పనిచేసే డిఫెన్స్ కాంట్రాక్టర్ మోనికా విట్ 2013లో కీలక సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేసింది. తద్వారా ఆ దేశం అమెరికా రక్షణ వ్యవస్థపై ఆపరేషన్ 'సాఫ్రన్ రోజ్' పేరిట భారీ సైబర్ దాడికి పాల్పడింది. చార్మింగ్ కిటెన్ మొట్టమొదటి సారి అప్పుడే వెలుగులోకి వచ్చింది. ఫేక్ ఇంటర్వ్యూలను కూడా ఈ మధ్య ఇది హ్యాకింగ్‌కు సాధనంగా మార్చుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. 2015లో ఇరాన్-అమెరికా అణు ఒప్పందం సమయంలోనూ అగ్రరాజ్యానికి చెందిన పలువురు అధికారులను ఈ బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. అలాగే 2017లో హెచ్‌బీఓ టీవీకి చెందిన 'గేమ్ ఆఫ్ త్రోన్స్' వంటి పలు ప్రముఖ కార్యక్రమాల ఎపిసోడ్‌లు ప్రసారమవడానికి ముందే దొంగిలించి డబ్బు డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి: అంతరిక్షంలోకి డైనోసార్.. ఆన్లైన్లో భారీ డిమాండ్!