కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై గట్టిగా స్పందించింది చైనా. ట్రంప్ కావాలనే తమపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.
ఆరంభంలోనే వైరస్ ఉద్ధృతిపై చైనా స్పష్టత ఇవ్వనందున ఇప్పుడు ప్రపంచం పెద్ద మూల్యం చెల్లించుకుంటోందని ట్రంప్ గురువారం ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేలమంది మృతి చెందగా.. 2లక్షలకు పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తిప్పికొట్టారు.
వైరస్‌కు వ్యతిరేకంగా చైనా పోరాడుతుంటే.. అమెరికాలోని కొంతమంది అందుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా లేనిపోని నిందలను వేస్తున్నారు.
-జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
వైరస్ వ్యాప్తిపై ఇరుదేశాలు గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పించకుంటున్నాయి. అమెరికా నుంచే కరోనా వ్యాప్తి చెందిందని చైనా ఆరోపించింది. బీజింగ్ విమర్శలను తిప్పికొడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.