చైనాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అలీబాబాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధినేత జాక్‌మా అదృశ్యం ఆ సంస్థను ఇబ్బందుల్లో నెట్టేయగా.. తాజాగా ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టే అంశాన్ని అగ్రరాజ్యం అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలీబాబాతోపాటు ప్రముఖ సోషల్ మీడియా గేమింగ్ సంస్థ టెన్సెంట్‌ను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ జర్నల్‌లో కథనం కూడా ప్రచురితమైంది.
బలం చేకూర్చిన ట్రంప్ నిర్ణయం
దీనికి మరింత బలం చేకూరుస్తూ.. జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్ గ్రూప్‌నకు చెందిన వీచాట్‌పే సహా 8 యాప్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది వరకే నిషేధం విధించారు. చైనాతో వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
అమెరికా నుంచి రాని స్పష్టత
ట్రంప్ నిషేధం విధించిన మరుసటి రోజే అలీబాబా షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. అంతేకాకుండా టెన్సెంట్ షేర్లు కూడా అనూహ్యంగా కుదేలయ్యాయి. దీంతో మదుపర్లు ఆలోచనలో పడ్డారు. చైనా ఆర్థిక వ్యవస్థలో కీలంగా ఉన్న జాక్‌మా పై అక్కడి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండటం, మరోవైపు కీలక యాప్‌లను నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు చూస్తున్నారు. అయితే అలీబాబా, టెన్సెంట్‌లను నిషేధిత జాబితాలో చేర్చే అంశంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ట్రంప్ ఆదేశాల్ని ఆయన కొనసాగిస్తారా?
నూతన అధ్యక్షుడు జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలను బైడన్ కొనసాగిస్తారా?లేదా? అనే అంశంపైనా సందిగ్ధత నెలకొంది. ఈ రెండు కంపెనీల్లోనూ దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్ల మేర అమెరికా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని అమెరికా నిర్ణయం తీసుకుంటే అలీబాబా, టెన్సెంట్ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లవుతుంది. గతంలోనూ చైనాకు చెందిన ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఎస్‌ఎంఐసీ, ఆయిల్ తయారీ సంస్థ సీఎన్‌ఓఓసీలతో పాటు 35 కంపెనీలను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.
ఇదీ చూడండి: అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ దర్యాప్తు