భారత ఎదుగుదల తనకు ఇబ్బందిగా మారుతుందని చైనా భావిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. తన లక్ష్యాలను చేరుకోకుండా భారత్ అడ్డుపడుతుందని చైనా భయపడతోందని తెలిపింది. అందుకే భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చైనా చూస్తోందని ఓ నివేదికలో స్పష్టం చేసింది.
బైడెన్- ట్రంప్ అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ.. ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలను చైనా లెక్కచేయడం లేదని ప్రధానంగా ఆరోపించింది.
"అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్ పెంచుకుంటున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో రెచ్చగొట్టి లాభపడాలని చూస్తోంది. తన పొరుగున ఉన్న దేశాలు, ముఖ్యంగా ఆసియాన్ దేశాల భద్రత, స్వయం ప్రతిపత్తి, ఆర్థిక వ్యవస్థను అణగదొక్కాలని యోచిస్తోంది. ఆసియా దేశాల్లో అమెరికా ప్రభావాన్ని తగ్గించి తన ఆధిపత్యం చలాయించాలని వ్యూహాలు రూపొందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని కుట్రలు పన్నుతోంది."
- అమెరికా విదేశాంగ నివేదిక
తూర్పు లద్దాఖ్ ఘర్షణలపైనా..
ఈ సందర్భంగా భారత్-చైనా మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనను కూడా అమెరికా ఈ నివేదికలో ప్రస్తావించింది. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్‌ను రెచ్చగొట్టి ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్ల మరణానికి చైనా కారణమైందని అగ్రరాజ్యం దుయ్యబట్టింది. ఇప్పటికే రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించింది. అటు తైవాన్‌తోనూ బీజింగ్ వివాదాలు సృష్టించుకుంటోందని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంగా ఉన్న తైవాన్ను చైనా తన భూభాగంగా చెప్పుకుంటూ బలవంతంగా తమ దేశంలో విలీనం చేసుకోవాలని యత్నిస్తోందని అమెరికా విమర్శించింది.
కరోనాకు కారణం..
కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడానికి కూడా డ్రాగనే కారణమని అగ్రరాజ్యం మరోసారి దుయ్యబట్టింది. చైనా నిర్లక్ష్యం వల్లే వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టిందని, ఆ తర్వాత ప్రపంచమంతా పాకి కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసిందని బీజింగ్‌పై విరుచుకుపడింది.
ఇదీ చూడండి: భారత్ పకడ్బందీ వ్యూహం.. 'వజ్రాలహారం'తో డ్రాగన్‌కు కళ్లెం