చైనాపై మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకూడదని ఆ దేశం కోరుకుంటోందని ఆరోపించారు. దిగుమతి సుంకాల పెంపుతో బిలియన్ల కొద్దీ డాలర్లు వారి నుంచి తీసుకోవటమే అందుకు కారణమని తెలిపారు. తనకు బదులుగా.. నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్.. తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని చైనా కోరుకుంటోందని పేర్కొన్నారు.
" చైనా ఎప్పుడూ మన దేశానికి ఏమీ ఇవ్వలేదు. గత ఎనిమిదేళ్లుగా మన దేశానికి వారు నష్టం చేకూరుస్తున్నారు. అయినా బిడెన్, ఒబామా ఏమీ చేయలేదు. నేను అధికారంలోకి వచ్చాక వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. వారు ఇప్పుడు మన దగ్గరి నుంచి ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు.
చైనా బిడెన్‌ను అధికారంలో చూడాలనుకుంటోంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన దేశాన్ని శాసించాలని వారు కోరుకుంటున్నారు. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కరోనా నష్టానికి సుంకాలు విధిస్తాం: ట్రంప్
కరోనాతో చేసిన నష్టానికి చైనా పరిహారం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు ట్రంప్. ఈ మేరకు చైనాపై 1 ట్రిలియన్ డాలర్ల మేర సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తికి శిక్షగా చైనాకు రుణాలు చెల్లించకుండా ఉండే అంశాన్ని తోసిపుచ్చారు. సుంకాలు, ఇతర మార్గాల ద్వారానే వారికి శిక్ష విధిస్తామని తెలిపారు.
కరోనా వ్యాప్తికి చైనానే బాధ్యత వహించి, పరిహారం చెల్లించాలని అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా పట్టుబడుతున్నాయి.