విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ వేలాది మంది చిలీ దేశ ఉపాధ్యాయులు సమ్మె నిర్వహిస్తున్నారు.
2 నుంచి 4 ఏళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు రాయితీ ద్వారా విద్యావకాశాలు కల్పించే విధంగా అక్కడి ప్రభుత్వం ఓ బిల్లు రూపొందించింది. దీనిని ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శాంటియాగోలో సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జూన్ 3 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో సుమారు 70 వేల మంది ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 5 లక్షల మంది పేద విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: టార్గెట్ 2020: ట్రంప్ ప్రచారం షురూ