"ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ గొప్ప అధ్యక్షుడిగా మారడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి కొత్త అధ్యక్షునికి, ఆయన యంత్రాంగానికి గొప్ప అవకాశం" అని కనెక్టికట్ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రవిభాగం ప్రొఫెసర్ పాల్.ఎస్.హెర్న్‌సన్ అభిప్రాయపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా ఎన్నికల వ్యవస్థ, ప్రచారం, పార్టీలకు నిధులు.. ఇలా పలు అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించిన ఆయన ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి, తదనంతర పరిణామాలపై 'ఈనాడు' ప్రతినిధి ఎం.ఎల్.నరసింహారెడ్డికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
![hernson on biden](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10292984_professor.jpg)
బైడెన్ పాలనా యంత్రాంగం ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి?
కరోనా తీవ్రత, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, సామాజికంగా విడిపోయిన వర్గాలు వీటిని దారిలోకి తేవడం ప్రధాన సవాళ్లుగా చెప్పవచ్చు. రాజధానిపైన, ఇతర ప్రాంతాల్లో అనేక విధ్వంసాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్ది సాధారణ వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలి. ప్రస్తుతం అమెరికా సంక్షోభంలో ఉన్నప్పటికీ.. అంతర్యుద్ధానికి దారి తీసేంత దారుణ పరిస్థితులు లేవు. 1960లలో నెలకొన్న తీవ్ర మాంద్యంగా ప్రస్తుత పరిస్థితిని చూడొచ్చు. అమెరికన్ కాంగ్రెస్‌లో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు చొరవ చూపలేకపోయారు. తాము రాజీపడితే తీవ్ర మితవాద నాయకుల చేతుల్లో పదవులను కోల్పోవాల్సి వస్తుందని భయపడ్డారు. ఇలా పలు అంశాలు బైడెన్ గొప్ప అధ్యక్షుడిగా మారడానికి అవకాశాన్నిస్తున్నాయి.
అమెరికా ఐక్యంగా ఉందంటారా?
ప్రస్తుతం అగ్రరాజ్యం చాలావరకు విడిపోయి ఉంది. రాజకీయ నాయకులు డెమోక్రటిక్, రిపబ్లికన్ ఓటర్లుగా విడిపోయారు. వీరిమధ్య లోతైన అగాధం ఉంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సిద్ధాంతపరంగా వైషమ్యాలు నెలకొన్నాయి. డెమోక్రాట్లలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు. అసమానతలు, పర్యావరణం, అంతర్జాతీయ ఆర్థిక సాయం తదితర అంశాలను నమ్మే వైట్‌కాలర్ ఉద్యోగులు గుర్తింపు రాజకీయాల(ఐడెంటిటీ పాలిటిక్స్) గురించి ఎక్కువగా మాట్లాడతారు. వీరంతా లౌకిక, వివిధ రకాల జీవన పరిస్థితుల పట్ల సహనం కలిగి ఉంటారు. తుపాకీ సంస్కృతి నిరోధానికి మద్దతు పలికేవారు. చట్టాన్ని నమ్మడం, గౌరవించడంతో పాటు రాజ్యాంగానికి, రాజకీయ ప్రక్రియకు విలువ ఇస్తారు.
సంప్రదాయ రిపబ్లికన్లు సాధారణంగా స్వేచ్ఛా మార్కెట్‌ను విశ్వసిస్తారు. బలమైన రక్షణ వ్యవస్థ ఉండాలంటారు. కొందరు వ్యాపార సంస్థల అధినేతలు, ధనికుల ధోరణి రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవడం, చట్టాన్ని నమ్మడం, రాజకీయ ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. రిపబ్లికన్ ఓటర్లలో అంతగా చదువుకోనివారు ఎక్కువ. ఉద్యోగాలు పోయినవారు లేదా భవిష్యత్తు గురించి భయపడే బ్లూకాలర్ వర్కర్లు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందినా నామమాత్రంగా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు.. లేదా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉంటారు. అసహనంతో ఉండేవారు, సొంత ఆయుధాలు కలిగిన వారు ఎక్కువ. రిపబ్లికన్లకు ట్రంప్ ఏది చెప్తే ఆ మార్గంలో వెళ్లడం తప్ప... రాజ్యాంగం, చట్టం, న్యాయానికి కట్టుబడి ఉండాలన్న రాజకీయాలను అర్థం చేసుకోరు.
![challenges before biden](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10292984_biden.jpg)
ప్రస్తుత అమెరికా పరిణామాలకు బాధ్యులెవరు?
ఇవి కొత్తగా వచ్చినవి కావు. సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ట్రంప్ విభజన రాజకీయాలు, ప్రచారంలో అనుసరించిన పద్ధతులు, పాలన.. అన్నీ కలిపి రాజధానిపై దాడి లాంటి పరిస్థితులకు దారితీశాయి. డెమోక్రాట్ నేతలు కాంగ్రెస్‌లో దీర్ఘకాలం ఆధిపత్యంలో కొనసాగడం, అహంకారం, ప్రభుత్వ విస్తరణ, గుర్తింపు రాజకీయాలపై కేంద్రీకరణ, రిపబ్లికన్లకు సరైన అవగాహన లేకపోవడం వంటివి విభజనకు కారణాలయ్యాయి.
ప్రజాస్వామ్య పాలనను తక్కువ చేసి చూపడానికి కన్జర్వేటివ్ గ్రూపులు తమ హక్కులను వినియోగిస్తున్నాయా?
అవును, ఇది నిజమే. తాము వాక్ స్వాతంత్య్రానికి, న్యాయం, రాజ్యాంగానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని చెప్తారు. వారికి అనుకూలంగా ఉన్నప్పుడు, వారి లక్ష్యానికి దగ్గరగా ఉన్నప్పుడు మద్దతు ఇస్తారు. అయితే వారితో విభేదించే హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో మద్దతు ఇవ్వరు. ప్రజాస్వామ్య పద్ధతులను రిపబ్లిక్ పార్టీ అంగీకరించదు. అసహనాన్ని నియంత్రించడంలో ఇరుపార్టీల వైఫల్యం, తెల్లవారి ఆధిక్యాన్ని కోరుకొనే విధ్వంసకర గ్రూపులు సమస్యకు ఆజ్యం పోశాయి.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అధిక సంఖ్యలో అమెరికన్లు ట్రంప్ వెనుక సమీకరణ అయినట్లు కనిపిస్తుంది?
కొందరు రిపబ్లికన్ రాజకీయ నాయకుల వల్లే తమకు ప్రయోజనం కలుగుతుందని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు. వాస్తవాల కంటే కుట్రలు జరిగాయన్న ట్రంప్ మాటలనే వాళ్లు ఎక్కువగా విశ్వసిస్తున్నారు.
రాజకీయంగా మళ్లీ సాధారణ పరిస్థితి రావడానికి అమెరికాలో పార్టీల పాత్ర ఎలా ఉండాలి?
విలువలకు కట్టుబడిన వాళ్లను చేర్చుకోవడం, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు మెరుగ్గా వ్యవహరించాలి. విజయం కోసం విలువలను తుంగలో తొక్కేవారిని, ఎన్నికలే లక్ష్యంగా పార్టీల్లోకి వచ్చేవారిని నిరోధించడానికి కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది. నాయకత్వ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తుంటే, ఓటర్లు వారిని అనుకరిస్తున్నారు. ఈ కారణంగానే మెరుగైన వ్యవస్థలు, అమెరికా పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించడంలో వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది.
అమెరికాలో తలెత్తిన పరిస్థితుల వెనుక చైనా పాత్ర ఉందంటారా?
ఇది చైనా ముప్పుగా కనిపిస్తోంది. అయితే కొందరు రాజకీయ నాయకులు చైనా గురించి ఎక్కువగా మాట్లాడుతూ అంతర్గత ముప్పుపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, మీడియా తదితరాలకు ప్రాధాన్యం ఉంది. ట్రంప్ పాలనలో ఈ వ్యవస్థల పరిస్థితి ఏమిటి?
అమెరికన్ కాంగ్రెస్, కోర్టులతో సహా అన్నింటికీ ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం ద్వారా అన్ని వ్యవస్థలను ట్రంప్ ఓ పక్కకు నెట్టేశారు. వాటిని అతలాకుతలం చేశారు. కాంగ్రెస్, న్యాయస్థానం, ఇతర రాజ్యాంగ ప్రమాణాలను విస్మరించారు. ఇందులో ప్రాథమికంగా రాజకీయ పార్టీల పాత్ర లేనప్పటికీ, ఎన్నికల వ్యవస్థ, దానిలో ప్రజాదరణ పొందడం, ఎన్నికల్లో విజయం సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటివి. వీరి మెజారిటీ రూల్ రాజకీయాలను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.
అమెరికాలో మితవాద (రైటిస్ట్) రాజకీయాల భవిష్యత్తు ఏమిటి?
భవిష్యత్తులో అమెరికాలో జరగబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. విధ్వంసకర, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను నిరోధించడానికి చట్టాలను కఠినంగా అమలు చేసే యంత్రాంగం ముఖ్యం. రిపబ్లికన్లలో కూడా బలమైన, నిజాయతీ కలిగిన నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి:బైడెన్ ప్రమాణం వేళ రణరంగంలా వాషింగ్టన్